అధికార పార్టీ నేతలు.. ప్రజలకు చేస్తున్న హెచ్చరికలు.. తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని.. లేకపోతే.. పథకాలు ఆపేస్తామని.. నాయకులు తరచుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలో ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా చేరిపోయారు. ఆయన కూడా ప్రజలను బెదిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం వైసీపీ నాయకులు గడపగడపకు కార్యక్రమానికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాయకులు.. ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను ప్రజలకు వివరించి.. వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయాలని.. గత మూడేళ్లలో ప్రబుత్వం ఏం చేసిందో వివరించాలని.. సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు హితవు పలుకుతున్నారు. అయితే.. దీనికి భిన్నంగా నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పత్తిపాడులో గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే పర్వత.. ప్రజల్లోకి వెళ్లారు. ప్రబుత్వం ఏం చేసిందో వివరించారు.”జగనన్న ఇళ్ల పథకం” కింద ఇళ్లను ఇస్తున్నామని చెప్పారు. అయితే.. ఆయన ఇక్కడితో ఆగిపోలేదు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకే ఓటేయాలని.. లేకపోతే.. పథకాలు నిలిచిపోతాయని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం తప్ప ఏ ఇతర ప్రభుత్వాలు వచ్చినా.. ప్రజలను పట్టించుకోవని.. కాబట్టి జగన్ సర్కారుకే ఓటేయాలని హెచ్చరించారు.. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates