ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నిరసన గళాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీకి ఓ తలనొప్పిగా మారిపోతే.. తాజాగా పార్టీ సీనియర్ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తనదైన శైలిలో నిరసన గళం విప్పారు. అది కూడా జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ధర్మాన తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబందించి జగన్ ఎంచుకున్న ప్రాతిపదిక తప్పని, ఆ ప్రాతిపదికతో వెళితే.. రాష్ట్రంలో అభివృద్ధి దశాబ్దాల మేర వెనక్కెళ్లినట్టేనని ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశం ఓ అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లా ప్రాతిపదికన రాష్ట్రంలో ప్రస్తుతమున్న జిల్లాలతో కలిపి మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లుగా విపక్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను అనుకున్నట్లుగానే జగన్ కు అధికారం దక్కింది. సీఎం పీఠం ఎక్కేశారు. సీఎంగా జగన్ అప్పుడే ఏడాది పాలనను కూడా ముగించేశారు. అయితే కొత్త జిల్లాల ఊసు అంతగా వినిపించలేదు. తాజాగా ఈ విషయంపై ఓ సమీక్ష సందర్భంగా జగన్ మరోమారు ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు మరోమారు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ సాగుతోంది.
ఇలాంటి క్రమంలో వైసీపీకి చెందిన కీలక నేత, సీనియర్ రాజకీయవేత్త, పాలనలో అపార అనుభవం ఉన్న నేతగా పరిగణిస్తున్న మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ధర్మాన నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు జగన్ ఐడియానే సరికాదన్న రీతిలో వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పాలి. అయినా దర్మాన ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘‘కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అయితే పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన వద్దు. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగితే… శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కెళ్లిపోతుంది’’ అంటూ దర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు.