ఏపీ సర్కారుపై ఇటీవల కాలంలో తరచుగా వ్యాఖ్యలు చేస్తున్న ప్రభుత్వ మాజీ ప్రదాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వ్యూహం రెడీ అయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కృష్ణారావు.. హైదరాబాద్ కేంద్రంగా.. ఏపీ సర్కారుపై తరచుగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
రాష్ట్రం ఆర్తిక సంక్షోభంలో చిక్కుకుందని కృష్ణారావు వ్యాఖ్యానించారు. వైసీపీ పేరు పెట్టకుండానే ఆయన చేసిన వ్యాఖ్య.. ఏంటంటే.. రాష్ట్రంలో మితిమీరిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని.. దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నారని.. దీనివల్ల రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలోకి జారిపోతోందని వ్యాఖ్యానించారు. మున్ముందు ఈ పరిస్థితి మరింత కష్టమైతే.. ప్రబుత్వానికి మనుగడ కూడా.. ఇబ్బంది అవుతుందన్న భావం ఆయన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో రేపు ప్రభుత్వాన్ని నడపడం ఇబ్బంది అయితే.. వెంటనే సర్కారును రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితిని తోసిపుచ్చలేమన్నారు. దీనికి తగిన విధంగా అధికార పార్టీ రెడీ అవుతోందని కృష్ణారావు వ్యాఖ్యానించారు. అందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చి.. మంత్రులు, నాయకులు.. కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
తద్వారా.. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్నే అజెండా చేసుకుని వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని కృష్ణారావు వ్యాఖ్యానించారు. మరి ఇదే నిజం అవుతుందా? లేక వైసీపీ ఐదేళ్లు ఎలాగోలా నెట్టుకొస్తుందా? అన్నది వేచి చూడాలి.