కేసీఆర్ షాక్ అయ్యే వార్త‌…ఆయ‌న కోసం పూజ‌లు!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌. ఓ వైపు చారిత్ర‌క సెక్ర‌టేరియ‌ట్‌ను కూల్చివేస్తూ భారీ బ‌డ్జెట్‌తో మ‌రో స‌చివాల‌యం నిర్మించేందుకు స‌న్న‌ద్ధం అవ‌డం… మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసుల క‌ల‌క‌లం కొన‌సాగుతుండ‌గా దాదాపుగా ప‌ది రోజుల నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారిక‌, వ్య‌క్తిగ‌త కార్యక‌లాపాల గురించి ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డం! కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్ప‌టికే పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మ‌రోవైపు హైద‌రాబాద్‌లో ఈ రోజు రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారిక కార్యాల‌య‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద కొంద‌రు యువకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? ఆయన మా ముఖ్యమంత్రి. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం నా హక్కు‘ అని ఇంగ్లీష్‌లో ఉన్న ప్లకార్డును ఓ యువకుడు ప్రదర్శించడం కలకలం రేపుతోంది. మ‌రోవైపు, తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థి ఉద్య‌మాల‌కు కేంద్రంగా నిలిచిన‌ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో సైతం ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాడ కోసం ప‌లువురు హ‌ల్ చ‌ల్ చేశారు. సీఎం కేసీఆర్ అడ్ర‌స్ ఎక్క‌డ‌? ఆయ‌న క్షేమంగా ఉండాలి అంటూ కొంద‌రు విద్యార్థులు పూజ‌లు చేశారు. త‌మ సీఎం ఎక్క‌డున్నా ఆరోగ్యంగా తిరిగి రావాల‌ని ఈ పూజ‌ల్లో పాల్గొన్న‌వారు ఆకాంక్షించా‌రు.

కాగా, సీఎం కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌తిప‌క్షాలు చేసే కామెంట్‌ల‌పై మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ మండిపడ్డారు. సీఎం కెసిఆర్ గట్టిగానే ఉన్నారని, ఆయనది బలమైన గుండె కాయ అని చెప్పుకొచ్చారు. “సీఎం ఎంత గట్టి గా ఉన్నారో మాకు తెలుసు. ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని మంత్రి వెల్లడించారు.ముఖ్య‌మంత్రి వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడుంటే ఏమిటీ? ఏ పథకమైనా ఆగిందా?ఆసరా పెన్షన్లు, రైతు బంధు ఆగిందా? “ అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.