కేసీఆర్ పీఎం కావాల‌ని.. ‘మ‌ద్యం-కోడి’ పంపిణీ

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలంటూ టీఆర్ ఎస్‌ నాయకులు మద్యం.. కోళ్లు పంపిణీ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. వరంగల్‌ చౌరస్తాలో అధికార పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి హమాలీ(కూలీలు)లకు మద్యం బాటిళ్లతో పాటు కోళ్లను పంపిణీ చేశారు. సుమారు 200 మంది హమాలీ కార్మికులకు పంపిణీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు.. పీఎం అయితే.. ఇవే చేస్తారా? అంటూ.. అధికార పార్టీపై.. విప‌క్షాలు విమ‌ర్శ‌ల బాణాలు సంధించాయి.

అయితే.. దీనిని రాజ‌నాల స‌మ‌ర్థించుకున్నారు. దసరా కానుకగా హమాలీలకు మద్యం, కోళ్లు పంచడంపై కొంతమంది కావాలనే తప్పు పడుతున్నారని రాజనాల శ్రీహరి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంటారని జోస్యం చెప్పారు.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో నిలువెత్తు కేసీఆర్, కేటీఆర్ క‌టౌట్లు పెట్టారు. కాబోయే పీఎం కేసీఆర్‌.. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ.. రాజ‌నాల అనుచ‌రులు.. నినాదాలు చేశారు. మ‌ద్యం తాగి.. కోడి కూర వండుకుని తినాల‌ని.. రేపు ఉద‌యం.. కేసీఆర్ ప్ర‌సంగాన్ని మ‌రిచిపోకుండా వినాల‌ని.. హ‌మాలీల‌కు హిత‌వు ప‌లికారు. ఇక‌, ఈ పంపిణీ గుప్పుమ‌న‌డంతో.. నిముషాల వ్య‌వ‌ధిలోనే.. వంద‌ల మంది కార్మికులు.. కూలీలు అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే.. అప్ప‌టికే పెట్టుకున్న ల‌క్ష్యం తీరిపోవ‌డంతో.. వ‌చ్చిన వారిని సాగ‌నంప‌డం.. త‌ల‌కు మించిన భారంగా మారింది. మ‌రి దీనిపై అధికార పార్టీ నేత‌లు ఏమంటారో చూడాలి.