ద‌స‌రా రోజే కేసీఆర్ కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌.. జెండా కూడా!!

జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించేందుకు ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ‌ సీఎం కేసీఆర్ త‌న దూకుడును పెంచారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌ముఖ్య‌మంత్రులు.. బీజేపీయేత‌ర పార్టీల నేత‌ల‌ను నిర్విరామంగా క‌లిసిన ఆయ‌న కొత్త పార్టీపైనా చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ కొత్త పార్టీ గురించిన అప్డేట్లు వ‌చ్చాయి. దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన ఉండనుందని టీఆర్ఎస్ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

దీని కోసం ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దసరా రోజునే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుందని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయం తో కేసీఆర్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే పార్టీ జెండా – ఎజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారని సమాచారం.

ఇక పార్టీకి సంబంధించిన జెండా రూపకల్పన విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశ చిత్ర పటంతో పాటు గులాబీ రంగు సైతం కేసీఆర్ జాతీయ పార్టీ జెండాలో మిళితమై ఉంటుందని తెలుస్తోంది. ఇక పార్టీ ఎజెండా విషయానికి వస్తే… రైతులు, దళితులు, యువతను టార్గెట్ చేయనున్నట్టు సమాచారం.

ఇప్పటి వరకూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేస్తూ కేసీఆర్ తమ జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లనున్నట్టు సమాచారం. ఇక పార్టీ పేరు.. ‘భారత రాష్ట్ర సమితి’ అని ఇప్ప‌టికే ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనినే ఖ‌రారు చేస్తార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి దసరాతో సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.