తెలుగు రాష్ట్రాల్లో మేధావులుగా పేరున్న వ్యక్తుల్లో సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి ఒకరు. స్వతహాగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఆయన.. గత కొన్నేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరుడిగా ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు అసలు పడదనే అభిప్రాయం బలంగా ఉంది జనాల్లో. తాను వైకాపా మద్దతుదారు అని చెప్పుకోరు కానీ.. ఆ పార్టీని, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో ఘాటు విమర్శలు ఎప్పుడూ చేసిన దాఖలాలు అంతగా కనిపించవు.
జగన్ అండ్ కో తీవ్ర విమర్శల పాలైన వివాదాల విషయంలో ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని, దాని అధినేతను కొంచెం ఘాటుగానే విమర్శిస్తుంటారు. అందుకే తెలుగుదేశం మద్దతుదారులు తెలకపల్లి రవిని సోషల్ మీడియాలో గట్టిగా టార్గెట్ చేస్తుంటారు. మేధావి ముసుగేసుకున్న వైసీపీ మద్దతుదారుగా ఆయన్ని విమర్శిస్తుంటారు.
ఈ నేపథ్యంలో తెలకపల్లి రవి రీట్వీట్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అబ్యూజివ్ ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఒక వైసీపీ ప్రో హ్యాండిల్ నుంచి తాజాగా ఒక దారుణమైన పోస్టు వచ్చింది. కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో బ్రాహ్మణి భేటీ అంటూ చీప్ కామెంట్‌తో ఈ పోస్టు పెట్టారు. దీన్ని తెలకపల్లి రవి రీట్వీట్ చేశారు. దీంతో తెలుగుదేశం మద్దతుదారులు ఈ రీట్వీట్‌ను స్క్రీన్ షాట్ చేసి ఆయన్ని దారుణంగా తిట్టారు.
ఐతే కాసేపటికే తెలకపల్లి రవి ఈ పోస్టుపై స్పందించారు. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ పోస్టు పెట్టారని, దాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. కానీ తెలుగుదేశం మద్దతుదారులు శాంతించలేదు. వైసీపీ ప్రో హ్యాండిల్స్‌ను తెలకపల్లి రవి ఫాలో అవుతారని, యథాలాపంగా ఈ పోస్టును రీట్వీట్ చేసి ఉంటారని.. తర్వాత తన అకౌంట్ హ్యాక్ అయిందని డ్రామాలాడుతున్నారని.. బహుశా ఆయన హ్యాండిల్‌ను ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ వాళ్లు మేనేజ్ చేస్తుండొచ్చని ఆరోపణలు గుప్పించారు. ఐతే ఈ విమర్శలపై తెలకపల్లి రవి తర్వాత తీవ్రంగానే స్పందించారు.