కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ రావాలని ప్రార్థిస్తారు అందరూ. ఐతే మీకా భయం లేకుండా నెగెటివ్ తెప్పిస్తాం.. మీకు నెగెటివ్ అని పేర్కొంటూ రిపోర్ట్ ఇస్తాం.. ఇందుకోసం కేవలం రూ.2500 ఇస్తే చాలు అని ఆఫర్ చేస్తోందట ఓ ప్రైవేటు ఆసుపత్రి.
కరోనా ఉన్నా కూడా నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా మీరు సోషల్ బాయ్‌కాట్‌కు గురి కాకుండా చేస్తామంటూ ఆ ఆసుపత్రి వాళ్లు చెప్పి గుట్టుగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఆశ్చర్యకర ఉదంతం.
ఆ సిటీలోని న్యూ మీరట్ హాస్పిటల్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కరోనా నెగెటివ్ రిపోర్టుల్ని అమ్మకానికి పెట్టినట్లు అధికారులకు సమాచారం అందడం.. వాళ్లు వెళ్లి తనిఖీ చేసి అది నిజమే అని నిర్ధరించడంతో ఆసుపత్రిని సీజ్ చేశారు.
అంతే కాదు.. ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా వేశారు పోలీసులు. ఆస్పత్రి లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. కాగా 2,500 రూపాయలకే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు మీ చేతిలో పెడతామంటూ ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇక ఈ ఆరోపణలను సదరు ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. తమకే పాపం తెలియదని.. తమ ఆసుపత్రి పేరును చెడగొట్టేందుకు కొందరు కావాలనే ఈ వీడియోను బయటపెట్టారని ఆరోపించింది. అనివార్య పరిస్థితుల్లో కరోనా టెస్టులకు వెళ్లి.. పాజిటివ్‌గా తేలాక సోషల్ బాయ్‌కాట్‌కు గురవుతున్న వ్యక్తులు.. ఈ ఆసుపత్రి ద్వారా నెగెటివ్ రిపోర్ట్ తీసుకుని అందరికీ తాము కరోనా ఫ్రీ అయ్యామని చెప్పుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.