డ్యామేజ్ కాక ముందు ఇదే క్లారిటీ ఇస్తే సరిపోయేదిగా సజ్జల?

దారిన పోయే దానిని మీదేసుకోవటంలో వైసీపీకి మించిన రాజకీయ పార్టీ మరొకటి ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే.. మరికొన్ని సందర్భాల్లో ఆయన పార్టీ నేతలు చేసే తప్పులతో తరచూ ఏదో ఒక వివాదంలో జగన్ సర్కారు వార్తల్లో నిలుస్తుందని చెప్పాలి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ముఖ్యమంత్రికి షాకిచ్చిందన్న వార్తలు రావటం తెలిసిందే.

వైసీపీ శాశ్విత అధ్యక్షుడిగా పేర్కొంటూ ప్లీనరీ వేళ తీసుకున్న నిర్ణయంపై ఈసీ ప్రశ్నించటం.. దానికి సమాధానం చెప్పక పోవటంతో విజయసాయి రెడ్డిని క్లారిటీ కోరినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి వారికి షాకులు ఇచ్చేలా ఉన్నాయని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి శాశ్విత అధ్యక్షులుగా ఉండరన్న వ్యాఖ్య జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుల.. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి ఈ ఇష్యూ మీద రియాక్టు అయ్యారు. వైసీపీ జీవితకాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని సీఎం జగన్ రిజెక్టు చేసినట్లుగా చెప్పారు. జగన్ ఒప్పుకోకపోవటంతో ఆ నిర్ణయం మినిట్స్ లోకి ఎక్కలేదని.. దీంతో శాశ్వత అధ్యక్షుడు అనేది లేదని సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇక్కడ పాయింట్ ఏమంటే.. మరే రాష్ట్ర ప్రభుత్వంలో లేనంత మంది ప్రభుత్వ సలహాదారులు.. సలహాదారులు ఉన్నారు. ఇలాంటి వారంతా ప్రభుత్వానికి.. ప్రభుత్వాదినేతకు నష్టం వాటిల్లే వేళలో ఏం చేస్తుంటారు. సీఎం జగన్ కు ఈసీ షాకిచ్చిందంటూ బుధవారం సాయంత్రం నుంచి మీడియా గ్రూపుల్లో మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా డ్యామేజ్ చేసే వాటికి అత్యధిక ప్రయారిటీ ఇచ్చి.. ఇప్పుడు చెప్పినట్లుగా వాస్తవం ఏమిటి? ప్రచారం ఏం జరుగుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వటం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసే వీలు ఉంటుంది.

కానీ.. అలాంటిదేమీ చేయకుండా మౌనంగా ఉండటం వల్ల మొదటికే మోసం వచ్చిన చందంగా మరింత నష్టం కలుగుతుంది. మిగిలిన సలహాదారుల్ని పక్కన పెడితే.. సజ్జల లాంటి షార్ప్ అడ్వైజర్ అయినా ఇప్పటి మాదిరి కల్పించుకొని.. అసలు వాస్తవం ఇది అని చెప్పుకోవాలి కదా? అందుకు భిన్నంగా అంతా కాలేవరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత తీరుబడితో ఎంత స్పష్టత ఇస్తే మాత్రం ఏం ప్రయోజనం? అన్నది ప్రశ్న.

ప్రస్తుతం ఐదేళ్ల వరకు పార్టీకి సీఎం జగన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని.. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేయటంతో పాటు.. ఆ అంశాన్ని ఎన్నికల కమిషన్ కు పంపినట్లుగా పేర్కొన్నారు. ఇదే మాటలు బుధవారం రాత్రి వేళలో ప్రభుత్వ ప్రకటన రూపంలో జారీ చేసినా సరిపోయేది. అలా కాకుండా.. రచ్చ రచ్చ అయ్యాక తీరుబడిగా వివరాలు తెలియజేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. ఎందుకిలాంటి తప్పులు జరుగుతున్నాయి సజ్జల?