ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో రూ.3 వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
ప్రజలకు పనికి రాని భూములు ఇస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించిన ఆయన.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వడానికిఎందుకు మనసురావడం లేదని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం రూ.3వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని.. దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తక్షణమే పేదలకు కేటాయించాలి కోరారు. ఇళ్లు నివాసానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన 15 నెలలకు కూడా వాటిని పేదలకు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
2014-2019 మధ్యన కేంద్రం, రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు కేటాయించిందని.. వీటిలో 8.50 లక్షల ఇళ్లను గత ప్రభుత్వమే పేదలకు ఇచ్చిందని .. గృహప్రవేశాలకు సిద్ధమైన మిగతా 6 లక్షల ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందని అశోక్ బాబు విమర్శించారు. అత్యాధునిక వసతులతో, నాణ్యతా ప్రమాణాలతో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలుగా మార్చిందని.. పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా, ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఊళ్లకు దూరంగా, రోడ్డు, నీటి, విద్యుత్ వసతి లేని ప్రాంతాల్లో సెంటు స్థలం ఇస్తే పేదలకు ఏం ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం 151 సీట్లున్నాయని, వాపుని చూసి బలుపు అనుకుంటోందని.. పాలకులు నేలమీదకు దిగిరావడానికి ఎంతో సమయం పట్టదని ఆయన వ్యాఖ్యానించారు.