సీఎం జ‌గ‌న్ నోట‌.. ‘బ‌స‌వ‌తార‌కం’ మాట‌

బ‌స‌వ‌తార‌కం.. ఇండో అమెరిక‌న్ ఆసుప‌త్రి.. ఇది ప్ర‌తిప‌క్షం టీడీపీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే అన్న‌గారు ఎన్టీఆర్ త‌న‌యుడు.. బాల‌య్య చైర్మ‌న్‌గా ఉన్న ఆసుప‌త్రి. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పేరుతో నిర్మించిన ఆసుప‌త్రి. అయితే.. దీని గురించి ఏపీ ప్ర‌భుత్వాధినేత‌, సీఎం జ‌గ‌న్ తొలిసారి స్పందించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాక ముందు కూడా.. ఎప్పుడూ.. ఈ ఆసుప‌త్రి గురించి.. ఆయ‌న స్పందించ‌లేదు. స్పందిస్తార‌ని కూడా ఎవ‌రూ అనుకోలేదు. కానీ, తాజాగా ఆయ‌న అసెంబ్లీ వేదిక‌గా.. బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి గురించి.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

వైద్యరంగంపై మంగ‌ళ‌వారం నాడు అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. నాడు-నేడుతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. ‘దివంగత నేత వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని తెచ్చారు. చంద్రబాబు హయాంలో వైద్యరంగాన్ని అసలు పట్టించుకోలేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించాం’ అన్నారు.

అంతేకాదు.. మన తన బేధం లేకుండా.. బాలకృష్ణ నడుపుతున్న బసవతారం ఆస్పత్రికి గతంలో కన్నా ఇప్పుడే టైం టు టైం ఆరోగ్యశ్రీ డబ్బుల్ని ఇస్తున్నామ‌ని.. జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కన్నా.. త‌న‌ హయాంలోనే బసవతారకం ఆస్పత్రికి బిల్లలు సకాలంలో వస్తున్నాయన్న విష‌యాన్ని ఒక‌టికి రెండు సార్లు నొక్కి మ‌రీ చెప్పారు. ఈ ప‌రిణామం.. స‌భ‌లోని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అదేస‌మ‌యంలో గ‌త చంద్ర‌బాబు స‌ర్కారుపై జ‌గ‌న్ య‌థాలాపంగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

“గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం. సెల్‌ఫోన్‌ లైటింగ్‌లో ఆపరేషన్‌లు చేయడం చూశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి అనేక చర్యలు చేపట్టాం. 5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ఇప్పుడు 90శాతం మందికి పైగా ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నారు. వైద్యరంగంలో నాడు-నేడు కింద రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం” అని జ‌గ‌న్ అన్నారు.

ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను 3,118కి పెంచామ‌న్నారు. ఫ్యామిలీ డాక్టర కాన్సెప్ట్‌ తీసుకువస్తున్నామ‌ని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైద్యరంగంలో 45వేల ఉద్యోగాలు కల్పించామ‌న్న జ‌గ‌న్‌.. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. మెడికల్‌ కాలేజీల కోసం రూ.12,268 కోట్లు ఖర్చుపెడ్తున్నాం అని సీఎం జగన్ వివ‌రించారు.