టీడీపీపై మంత్రి రోజా ఇంత‌గా బ్లాస్ట్ అయ్యారేంటి?

టీడీపీ నేతలకు దేని మీద పోరాడాలో తెలియడం లేదని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. పిచ్చి పట్టినోళ్లలాగా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజా సాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారన్నారు. ఈ డేటా బాబా.. డేరా బాబా కంటే పెద్ద దొంగ అని విమర్శించారు. 30 లక్షల మంది డేటాను చోరీ చేశారన్నారు. డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయించారని విమర్శించారు.

23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని రోజా పేర్కొన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు బాడీతో పాటు మైండ్‌లో గుజ్జు కూడా కరిగిపోయిందని రోజా పేర్కొన్నారు. నిజంగా ఎన్టీఆర్ పైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రేమ ఉంటే సీఎంగా సంతకం పెట్టిన మొదటి రోజే అన్నా క్యాంటీన్ పెట్టుండేవాడన్నారు. టీడీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెళ్లి కానుక ఇస్తున్నామన్నారు. 200 యూనివర్శిటీల్లో విద్యాకానుకను అమలు చేస్తున్నామన్నారు.

ప్రజలను అభిమానిస్తాడు కాబట్టే జగన్ అమ్మఒడి తీసుకొచ్చారని రోజా పేర్కొన్నారు. టీడీపీ నేతలందరినీ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని జనం ఎదురు చూస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను ఎగరకొట్టిన నేత‌ చంద్రబాబు అని పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మలు బాగుండాలనే జగన్ ఆసరా పథకం పెట్టారని రోజా వెల్లడించారు. ఏనాడైనా మంచి పథకం పెట్టాలన్న ఆలోచనైనా చంద్రబాబు చేశాడా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీకి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.

చినరాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు హోం కే పరిమిత మయ్యాడని.. ఇప్పుడు దేశమంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారని రోజా పేర్కొన్నారు. మేం అందిస్తున్న పథకాలన్నీ సంక్షేమం కాదా? అని రోజా ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద మొత్తంలో సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదన్నారు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రోజా హెచ్చరించారు.

నన్ను తిట్టే జనసేన పార్టీ నాయకులు నగిరిలోని తప ఇంటికొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విలువలు లేని వ్యక్తి అని దూషించారు. ఏ ఎన్నికల్లో ఎవరికి ఓటేయమని చెబుతాడో తెలియదన్నారు. షూటింగ్‌లు లేని సమయంలో ప్యాకేజ్ తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టడమే పవన్ పని అని పేర్కొన్నారు. తమను తిడితే ఆకాశం మీద ఉమ్మినట్లేనని రోజా పేర్కొన్నారు.