జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని చాలా స్పీడ్ మీదున్న కేసీయార్ ప్రత్యేకంగా తన టీమును రెడీ చేసుకుంటున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా కేసీయార్ చేసిన ప్రకటన ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు. ఒకవైపు జాతీయ పార్టీ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తునే మరోవైపు క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించటంలో అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకున్నాక క్రియాశీలకంగా ఉండక వేరేదారేముంది ?
సరే ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే జాతీయ రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలని అనుకుంటే వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటేనే సాధ్యమవుతుంది. జాతీయ పార్టీల అధినేతలు, ప్రాంతీయ పార్టీల అధినేతల్లో కొందరు ఎక్కువకాలం ఢిల్లీలోనే ఉంటున్న విషయం చేస్తున్నదే. మరి కేసీయార్ మాత్రం సీఎంగా ఉంటూనే ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు.
ఇక్కడే అందరినీ అయోమయంలోకి పడేస్తోంది. ఇందు కోసమే ప్రత్యేకంగా ఒక టీమును రెడీ చేసుకుంటున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కర్నాటకలో జేడీఎస్ ప్రముఖుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా లాంటి వాళ్ళని తన టీములో చేర్చుకోబోతున్నట్లు సమాచారం. కుమారస్వామి అయినా వాఘేలా అయిన ప్రస్తుతానికి తీసేసిన తహసీల్దార్లే. వాఘేలా దాదాపు పాతికేళ్ళకిందటే ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఆయన చాలా పార్టీలు మారినా ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.
కుమారస్వామి పరిస్థితి కూడా డిటోనే. ఇలాంటి వాళ్ళని మరికొందరిని తనతో టై అప్ చేసుకుని వీళ్ళల్లో కొందరిని ఢిల్లీలోనే ఉండేట్లుగా కేసీయార్ మంతనాలు జరుపుతున్నారట. లేకపోతే వాఘేలాతో కేసీయార్ ఐదుగంటలపాటు చర్చలు జరపాల్సిన అవసరమే లేదు. ఇలాగే తొందరలోనే మరికొందరు సీనియర్లను కలుపుకుని ఒక టీమును రెడీ చేసుకోవాలని కేసీయార్ అనుకుంటున్నారట. వీళ్ళకు తన పార్టీలోని అత్యంత నమ్మకస్తులను కూడా జతచేసి ఢిల్లీలో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.