డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది త‌ప్పు.. క‌రోనా అలా కూడా వ్యాపిస్తుంది

క‌రోనా వైర‌స్ ప్ర‌ధానంగా దాని బాధితులు తుమ్మిన‌పుడు, ద‌గ్గిన‌పుడు వెలువ‌డే తుంప‌ర్లు మ‌రో వ్య‌క్తికి మీద ప‌డ‌టం ద్వారా వ్యాప్తిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) చెబుతూ వ‌స్తోంది. క‌రోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంద‌ని.. వైర‌స్ క‌ణాలు గాలిలో చాలాసేపు ఉంటాయ‌ని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు ముందు నుంచి చెబుతూ వ‌స్తున్న‌ప్ప‌టికీ.. డ‌బ్ల్యూహెచ్‌వో అందుకు ఆధారాలు లేవ‌ని కొట్టి పారేసింది. గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి చెంద‌ద‌నే చెబుతూ వ‌చ్చింది. కానీ ఇప్పుడా ఆ వాద‌న త‌ప్ప‌ని అంటున్నారు శాస్త్ర‌జ్ఞులు. 39 దేశాల‌కు చెందిన 239 మంది శాస్త్ర‌వేత్త‌ల బృందం క‌లిసి క‌రోనా ఏ ఏ ర‌కాలుగా వ్యాపిస్తుందో అధ్య‌య‌నం జ‌రిపారు. వైర‌స్ గాలి ద్వారా క‌చ్చితంగా వ్యాపిస్తుంద‌ని వీరి అధ్య‌య‌నంలో తేలింది.

ఈ శాస్త్ర‌వేత్త‌ల బృందం ఇదే వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తూ డ‌బ్ల్యూహెచ్‌వోకు లేఖ రాసింది. ఈ మేర‌కు అమెరికా ప‌త్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ క‌థ‌నాన్ని కూడా ప్ర‌చురించింది. దాని ప్ర‌కారం గాలిలో ఉండే చిన్న చిన్న క‌ణాల ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. క‌రోనా బాధితులు తుమ్మిన‌పుడు, ద‌గ్గిన‌పుడు వెలువ‌డే తుంప‌ర్లు గాలిలోని చిన్న క‌ణాల్లోకి ప్ర‌వేశించి ఒక నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయ‌ని.. ఆ ప‌రిస‌రాల్లో తిరిగిన వారు పీల్చే గాలి ద్వారా వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతుంద‌ని ఈ శాస్త్ర‌వేత్త‌ల బృందం స్ప‌ష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల‌ని.. త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వారంటున్నారు. దీనికి సంబంధించిన అధ్య‌య‌నాన్ని వ‌చ్చే వారం ఓ ప్ర‌ముఖ హెల్త్ జ‌ర్న‌ల్‌లో ఈ శాస్త్ర‌వేత్త‌ల బృందం ప్ర‌చురించ‌నుంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా ప‌ట్ల జ‌నాలు మ‌రింత అప్ర‌మ‌త్తం కావాల్సిందే.