మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత దంప‌తుల‌ అరెస్టు

ఫైర్ బ్రాండ్ రాజ‌కీయ నాయ‌కురాలిగా గుర్తింపు పొందిన‌.. ఏపీలోని అరకు గిరిజ‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కురాలు.. కొత్తపల్లి గీత, ఆమె భ‌ర్త‌ను సైతం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వారిని మంగ‌ళ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లోని నివాసంలోనే అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. ఆ వెంట‌నే వారిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి ఆమెను తరలించారు.

గీత‌, ఆమె భ‌ర్త‌ను ఏక‌కాలంలో అరెస్టు చేయ‌డం రెండు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేపింది. గ‌తంలోనే ఆమెపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విశ్వేశ్వ‌ర ఇన్ ఫ్రా పేరుతో రూ.50 కోట్ల మేర రుణం తీసుకొని ఎగ్గొట్టార‌నే ఆరోప‌ణ‌లు ఆమెపై ఉన్నాయి. దీనిపై గ‌త రెండేళ్ల కింద‌టే పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ఫిర్యాదు చేసింది. అప్ప‌టి నుంచి విచార‌ణ‌లో ఉన్న ఈ కేసులో సీబీఐ ఒక్క‌సారిగా వేగం పెంచింది.

ఈ క్ర‌మంలో అన్నీ విచారించుకుని గీత దంప‌తుల‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, త‌క్ష‌ణ బెయిల్ కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత దంప‌తులు పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోష‌న్‌లో విచారించాల‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల త‌ర్వాత‌.. ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది.

ఇక, గీత‌పై ఈ ఒక్క‌టే కాదు.. గ‌తంలోనూ అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. హైద‌రాబాద్‌లోని దుర్గంచెరువు ప్రాంతంలో ఆర్డీవోగా ప‌నిచేసిన గీత‌.. అక్కడ ఒక భూమిని క‌బ్జా చేశార‌నే కేసు ఉంది. ఈ క్ర‌మంలో ఆమె భ‌ర్త‌కు సైతం తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ కేసు కూడా విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. ఇక‌, రాజ‌కీయంగా కూడా ఆమె ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్నారు. వైసీపీతో అరంగేట్రం చేసిన ఆమె 2014లో అర‌కు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో గెలిచిన త‌ర్వాత‌.. క‌నీసం పార్టీ అధినేత జ‌గ‌న్‌కు మొహం కూడా చూపించ‌కుండానే.. స‌ర్వ‌తంత్ర స్వతంత్రంగా ఆమె వ్య‌వ‌హ‌రించారు. త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. అది సాగ‌లేదు. బీజేపీ కండువా క‌ప్పుకోవాల‌ని అనుకున్నారు. అది కూడా వీలు ప‌డ‌లేదు. దీంతో సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. అది కూడా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో .. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో గీత అరెస్టు సంచ‌ల‌నంగా మారింది.