రెండు నెలల కిందట తెలుగు రాష్ట్రాల జనాలు ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెగ పొగుడుతుండేవాళ్లు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురుస్తుండేది. కరోనా నియంత్రణలో కేసీఆర్ చాలా సమర్థంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించేది. ఈ విషయంలో ఏపీ సీఎం ఫెయిలైనట్లే అని అంతా తీర్మానించేశారు.
కానీ అప్పటితో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ విమర్శలెదుర్కొంటున్నారు. జగన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే ఇది స్పష్టమవుతోంది. నేషనల్ మీడియాలో కూడా ఇదే తరహాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు హైదరాబాద్ సహా తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో కేసీఆర్ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు కనిపించారు.
తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి జనాల్లో నైతిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. కొన్ని వారాలుగా ఆయన కనిపించడం లేదు. హైదరాబాద్లో రోజు రోజుకూ కరోనా తీవ్రత పెరిగిపోయి భయాందోళనలు పెరిగిపోతున్న సమయంలో కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడం, ఆయన్నుంచి ఏ రకమైన ప్రకటన కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో నిన్నట్నుంచి #whereiskcr హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్వీట్లు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
ఇది కేవలం ప్రత్యర్థులు చేయిస్తున్న పని అని కొట్టేయడానికి వీల్లేదు. సామాన్య జనాల నుంచి కూడా ఈ ప్రశ్న ఎదురవుతోంది. ఇదే సమయంలో మరోవైపు #10millioncovidtestsinap అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుండటం విశేషం. తెలంగాణతో పోలిస్తే ఏపీలో పది రెట్లకు పైగా కరోనా టెస్టులు చేశారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టి జగన్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates