ఏపీ మాజీ సీఎం.. చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. ఆయన పేరు ఎత్తకుండానే.. ‘ఏపీ అప్పటి సీఎం’ అంటూ.. చంద్రబాబుపై వ్యాఖ్యలు సంధించారు. ఆయన వల్లే.. తెలంగాణ పూర్తిగా నష్టపోయిందన్నారు. పునర్విభజన హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరామని, అయితే.. తమ మాటలను గత 8 ఏళ్లుగా కేంద్రం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.
ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపుల్లో భాగంగా లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారన్నారు. సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారని పేర్కొన్నారు. 2014లో అప్పటి ఏపీ సీఎం(చంద్రబాబు) చేతిలో ప్రధాని మోడీ కీలుబొమ్మగా మారారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్ తెచ్చారని, దీంతో పోలవరం ముంపు మండలాలను అన్యాయం ఏపీలో కలిపేసుకున్నారని.. కేసీఆర్ మండిపడ్డారు.
కనీసం.. తెలంగాణ శాసనసభకు ప్రతిపాదించకుండానే కర్కశంగా 7 మండలాలను ఏపీకి అప్పగించారని మోడీపై ధ్వజమెత్తారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా వారికే కేటాయించారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు దాడులు చేయబోతే.. కొందరు విషం తాగి చనిపోయారన్నారు.
విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూడా రాష్ట్రంపై కేంద్రం అదే విషం కక్కుతోందని మండిపడ్డారు. కేంద్రాన్ని రూపాయి అడిగామా? సబ్సిడీ అదిగామా? అని నిలదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదన్న కేసీఆర్.. మరో 18 మాసాల్లో కేంద్రంలో మరో ప్రభుత్వం.. ప్రజాప్రభుత్వం వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలోనే సాగనంపుతామని చెప్పారు.