మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గం అడ్డుడికినట్టు ఉడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పదుల సంఖ్యలో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా.. ఆ పార్టీ సీనియర్ నాయకులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గుడివాడ పట్టణం ఒక్కసారిగా గరంగరం అయిపోయింది. రెండు రోజుల కిందట.. కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. అదేసమయంలో ఆ పార్టీ మహిళా నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమకు క్షమాపణలు చెప్పాలంటూ.. డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే నాని ఇంటిని సైతం మహిళా నేతలు చుట్టుముట్టారు. ఈ పరిణామాల క్రమంలో తాజాగా టీడీపీ నేతలు నాని పై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గుడివాడలోని టీడీపీ కార్యాలయం వద్దకు నేతలు బయల్దేరగా పలువురు నేతలను మార్గంమధ్యలో పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ వర్ల రామయ్య తదితరులను పోలీసులు పామర్రు వద్ద అడ్డుకున్నారు. అక్కడ్నుంచి వారిని గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్, పెడన పార్టీ ఇన్‌ఛార్జి కాగిత వెంకట ప్రసాద్‌లు ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించి గుడివాడ చేరుకున్నారు. అనంతరం గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. వారిని పోలీసులు టీడీపీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. బారికేడ్లు, రోప్ పార్టీని ఏర్పాటు చేసి అక్కడే ఫిర్యాదు స్వీకరిస్తామని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, బోడెప్రసాద్, జయమంగళ వెంకట రమణ, కాగిత వెంకట కృష్ణప్రసాద్‌లు పోలీస్ బందోబస్తు, బారికేడ్లను తోసే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. అనంతరం రోప్ పార్టీని, బారికేడ్లను తోసుకుని ముందుకెళ్తూ కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలు పోలీస్‌స్టేషన్ చేరుకున్నారు. అప్పటికే వన్ టౌన్ పోలీసులు స్టేషన్ గేటు మూసివేశారు. ఈ చర్యపై ఆగ్రహించిన నాయకులు ఫిర్యాదు చేయడానికి వస్తే తాళాలు వేసుకోవడం ఏంటని ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో గుంపులుగా స్టేషన్‌కు రావడం సరికాదని.. నలుగురు మాత్రమే వచ్చి ఫిర్యాదు అందజేయాలని పోలీసులు సూచించారు. దీంతో రావి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, బోడె ప్రసాద్, కాగిత వెంకట కృష్ణప్రసాద్‌లు స్టేషన్‌లోకి వెళ్లి మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందని.. మహిళలపై గౌరవం లేకుండా చట్ట సభలు, మీడియా సమావేశాల్లో తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు.