కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. ఒకవైపే చూస్తున్నారా? తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారా ? తమతో విబేధిస్తున్నవారికి షాకులు ఇస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. తెలంగాణను బాగు చేస్తామని.. చెబుున్న కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. తాజాగా తీసుకున్న నిర్ణయం.. ఆ పార్టీనే ఇరుకున పడేసింది. అదే సమయంలో తెలంగాణను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఏపీకి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని.. వీటిని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని.. ఏపీ ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి విన్నవించారు.
ఇలాంటి విన్నపాలు సహజమే. అయితే.. అసలు విషయం ఏంటి? అనేది తెలుసుకున్నారా? లేదా? అనేది ప్రధాన ప్రశ్న. అదేమయంలో 6800 కోట్ల రూపాయలను ఇవ్వాలని ఆదేశించే సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ.. డిస్కమ్ అధికారు లను కానీ.. సంప్రదించారా? అనేది ప్రశ్న. మరోవైపు.. అసలు తెలంగాణ ప్రభుత్వం.. ఈ నిధులనుతాము ఇవ్వాల్సిన అవసరం లేదని. ఎప్పటి నుంచో చెబుతోంది. ఏపీనే తమకు ఇవ్వాలని కూడా గతంలో విద్యుత్ కమిషన్ ముందు తన వాదనను కూడా వినిపించింది. అయితే.. దీనిపై సుదీర్ఘ కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో తిరుపతిలో జరిగిన దక్షిణ ప్రాంత మండలి రాష్ట్రాల సమావేశంలో సీఎం జగన్ అనూహ్యంగా ఈ విషయాన్ని లేవనెత్తారు. హోం మంత్రి అమిత్ షాకు సమస్య ను వివరించారు. తెలంగాణ నుంచి బకాయిలు ఇప్పించారు. అయితే.. ఆ సమావేశానికి తెలంగాణ సీఎం డుమ్మా కొట్టారు. అయినంత మాత్రాన కేంద్రం.. తెలంగాణ అధికారులను సంప్రదించిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సంప్రదించి ఉంటే.. పరిణామాలు వేరేగా ఉండేవని పరిశీలకులు చెబుతున్నారు.
రెండు రాష్ట్రాలకు తగిన న్యాయం చేయాల్సిన ఈ విషయంలో.. కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. అది.. అంతిమంగా తెలంగాణలో బీజేపీని ఇరుకున పడేయడం ఖాయమని అంటున్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన అసవరం లేదని చెబుతున్న నిధులను వడ్డీ తో సహా ఇవ్వాలని ఆదేశించడం.. నెల రోజుల్లోనే బకాయిలు చెల్లించాలని చెప్పడం ద్వారా.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కేంద్రం దృష్టిలో పెట్టుకున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. కేవలం .. ఏకపక్షంగా.. లేదా కేసీఆర్‌ను ఏదో ఒకరకంగా ఇరుకున పెట్టాలనే రాజకీయ వ్యూహంతోనే కేంద్రం ఇలా నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై కేసీఆర్ సంధించే ప్రశ్నలకు బీజేపీ నేతలు ఏం చెబుతారో చూడాలని అంటున్నారు.