రాజకీయాల్లో ఎక్కడైనా.. ఎప్పుడైనా.. కొన్ని పరిణామాలు.. ఊహించనివి ఉంటాయి. పార్టీలు.. నాయకులు కూడా అక్కడ నెలకొన్ని పరిస్థితిని.. పరిణామాలను అంచనా వేసుకుని.. ముందుకు సాగుతుంటారు. కాబట్టి.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నా.. చూసీ చూడనట్టే వ్యవహరిస్తారు.. అయితే.. ఇది ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయితే పర్వాలేదు. కానీ, లెక్కకు మించిన నియోజక వర్గాల్లో అయితే.. ఎలా ఉంటుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో జరుగుతున్న చర్చ.
ఎందుకంటే.. దాదాపు 12 నుంచి 20 నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం దాగుడు మూతలు ఆడుతోందనే వాదన వినిపిస్తోంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరేసి చొప్పున కొన్ని కొన్ని చోట్ల అయితే.. ముగ్గురు నేతలు చొప్పున ఆయా టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. పైగా.. వీరిలో పొరుగు పార్టీ నుంచి వచ్చిన నాయకులు.. కూడా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఉదాహరణకు.. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్.. వైసీపీలో చేరారు.
అయితే.. ఇక్కడ వైసీపీ తరఫున ఓడిపోయిన ద్రోణంరాజు శ్రీనివాసరావు ఉన్నారు. మరి.. టికెట్ ఈయనకు ఇస్తారా.. వాసుకు ఇస్తారా? అనేది సమస్య. చీరాలలో గెలిచిన.. టీడీపీ సీనియర్ నాయకుడు.. కరణం బలరాం వైసీపీలోచేరారు. అయితే.. ఇక్కడ ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నారు. దీంతో వీరిమధ్య టికెట్ పోరు కొనసాగుతోంది. అలాగే, గన్నవరం నియోజకవర్గంలోనూ వంశీ వర్సెస్ వైసీపీ నాయకులు.. తలపడుతున్నారు. ఇక, గుంటూరు వెస్ట్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఇక, వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతలమధ్య వివాదాలు తారస్తాయికి చేరుతున్నాయి. శ్రీకాళ హస్తి, కనిగిరి, ఎర్రగొండపాలెం, ఒంగోలు, విజయవాడ పశ్చిమ, రాజంపేట, పలాస.. ఇలా.. లెక్కకు మిక్కిలి గా.. వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లోనూ.. భారీ ఎత్తున నాయకుల మధ్య వివాదాలు.. విభేదాలు సాగుతు న్నాయి. దీంతో ఈ నియోజకవర్గాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి ఫలితం ఇవ్వనున్నాయనేది ఆసక్తిగా మారింది.
ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని సీఎం జగన్ సమీక్షించారని.. మార్పులు సూచించారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆడుతున్న దాగుడు మూతలు.. నేతలను ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తున్నాయని చెబుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.