ఏపీ సీఎం జగన్‌పై తనదైన శైలిలో పంచ్ లు విసిరే.. జనసేనాని పవన్ కళ్యాణ్.. తాజాగా మరోసారి అదే శైలిలో విమర్శలు గుప్పించారు. రెండు రోజుల కిందట సీఎం జగన్.. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఆయన పర్యవరణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. సముద్రం నుంచి చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్‌తోనే మానవ మనుగడ సాధ్యమవుతోందని సీఎం చెప్పారు.
ఈ వ్యాఖ్యలపైనే పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు పర్యావరణంపై ఇప్పటికిప్పుడు ప్రేమ పుట్టిందా అంటూ వ్యంగ్యంగా ట్విట్ చేశారు. విశాఖలో పారిశ్రామిక కాలుష్య నివారణకు కనీస చర్యలు లేవని విమర్శించారు. విషవాయు వులు లీకేజీ అవుతూ ప్రజలు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని అరికట్టేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. వాటికి కారణమైన వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు.. విశాఖలో రుషికొండను ధ్వంసం చేసి, ఇప్పుడు మాత్రం ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధిస్తున్నామనడం విడ్డూరంగా ఉందన్నారు. నీటి వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న కంపెనీల వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించాలన్నారు. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థల ద్వారా జరుగుతున్న హానిపై ప్రజా క్షేత్రంలో వివరిద్దామని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates