వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని.. కలలు గంటున్న పార్టీల్లో జనసేన కూడా ముందు వరుసలోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తామని.. పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తానని.. జనసేన అధినేత పవన్ చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వ్యూహాన్ని మాత్రం అమలు చేయలేక పోతున్నారనే వాదన ఉంది. ఉదాహరణ కు రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జనసేన తరఫున ఎంత మంది పోటీ చేయనున్నారనే విషయంపై ఇప్పటి వరకు పార్టీ అధినేతకే క్లారిటీ లేక పోవడం గమనార్హం.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 175 నియోజకవర్గాల్లో కనీసం 100 చోట్ల అయినా.. నిలబెట్టేందుకు కీలకమైన ప్రజలను తమవైపు తిప్పుకోగలిగిన.. వైసీపీ, టీడీపీ వంటి బలమైన పార్టీలతో తలపడిగిన సైన్యం జనసేన వద్ద ఉందా? అంటే.. ప్రశ్నార్థక మే. గత ఎన్నికల్లో కూడా..అతి కష్టం మీద 143 స్థానాల్లోనే జనసేన తరపున నాయకులు పోటీ చేశారు. మిగిలిన స్థానాలను పొత్తులో భాగంగా వదిలేశారనే విషయం తెలిసిందే. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంస్థాగతంగా పార్టీని ముందుకు నడిపించడం లోను.. నాయకులను తయారు చేయడంలోనూ.. పార్టీ అధినేత ముందడుగు వేయలేదు.
మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. నిజానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలనే తపనే, ఆకాంక్ష ఉండి ఉంటే.. ఖచ్చితంగా జనసేన.. ఆ దిశగా అడుగులు ప్రారంభించి ఉండాలి. కానీ.. ఇప్పటి వరకు అలా చర్యలు చేపట్టింది కూడా లేదు. మరి ఇదే పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగిస్తారనేది చూడాలి.పైగా.. గత ఎన్నికల్లో పోటీ చేసే అబ్యర్థులకు ముందుగా పరీక్షలు పెట్టారు. వారిని ఇంటర్వ్యూలు చేశారు. ఆఖరుకు వారికి ఎలాంటి టికెట్లు కూడా ఇవ్వకుండా.. తనకు నచ్చిన వారికి ఇచ్చారని.. కొన్ని సిఫారసుల మేరకు టికెట్లు పంచారనే వాదన వినిపించింది.
దీనికితోడు.. జంపింగులకు కూడా టికెట్లు ఇచ్చారు. కానీ.. ఇప్పుడు వీటిలో ఒక్క వ్యూహాన్ని కూడా ..పవన్ అమలు చేయడం లేదు. అసలు .. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. దీనిని చూస్తే.. అసలు.. చెబుతున్న మాటలకు.. చేసుకున్న లక్ష్యానికి మధ్య పొంతన కనిపించడం లేదని.. పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. మరి ఇప్పటికైనా.. నియోజకవర్గాలపై పట్టు పెంచుకునేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తేనే జనసేనకు అంతో ఇంతో మేలు జరుగుతుందని అంటున్నారు.