కుప్పం.. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు .. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించడాన్ని స‌హించ‌లేక పోయారు. వ్యూహాత్మ‌కంగా.. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతలు రాళ్ల‌దాడితో చెల‌రేగిపోయారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్ర‌బాబు కుప్పం చేరుకున్నారు. ఈ క్ర‌మంలో చంద్రబాబుకు రాష్ట్ర సరిహద్దు కొంగనపల్లెలో వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇక్కడ నుంచి చంద్ర‌బాబు రామ‌కుప్పం చేరుకోవాల్సి ఉంది. అక్క‌డ నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించాలి.

అయితే.. చంద్ర‌బాబు ప‌ర్య‌టించే రూట్ ముందుగానే తెలుసుకున్న వైసీపీ నాయ‌కులు కొంద‌రు.. ఆయ‌న‌ను అడ్డగించే ప్ర‌య‌త్నం చేశారు. రామకుప్పం మండలం కొల్లుపల్లి వ‌ద్ద‌.. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు, తోరణాలు కట్టారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. ఫలితంగా ఇరుపార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. ఇందులో బోదుగూరు ఎస్సైకి, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

ఇంత‌లోనే అక్క‌డ‌కు కాన్వాయ్ చేరుకుంది. మ‌రికొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. కాన్వాయ్‌పై కూడా రాళ్లు వేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. పోలీసులు అప్ర‌మ‌త్త‌మై.. వారిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే.. స‌భాస్థ‌లికి చేరుకున్న చంద్ర‌బాబు వైసీపీ స‌ర్కారుపై తీవ్ర‌స్తాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వైసీపీ సర్కారు ఎన్ని రోజులు ఉంటుందో వారికే తెలియదని  చంద్రబాబు అన్నారు. వైసీపీ నేత‌ల‌ను ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పింఛన్లు తొలగించలేదని చంద్ర‌బాబు చెప్పారు. గండికోట జలాశయం ద్వారా పులివెందు లకు నీళ్లు తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వైసీపీ నేతలకు కుప్పం నియోజకవర్గం అంటే కక్ష అని మండిపడ్డారు. కుప్పంలో చోటామోటా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను వ‌స్తున్నాన‌ని ముందుగానే తెలుసుకుని.. మా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఇవ‌న్నీ తెలిసి కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు. వైసీపీ నాయ‌కుల‌తో పోలీసులు కుమ్మ‌క్క‌య్యారు“ అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.