బీజేపీ – జగన్ బంధాన్ని తేల్చనున్న ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇపుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ ఎంపీలు కోరారు. పార్టీ అధ్యక్షుడ్ని గౌరవించకపోవడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలకు పాల్పడి స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు.

అయితే, తనపై అనర్హత వేటు వేయవద్దంటూ రఘురామకృష్ణం రాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుతో తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని….తాను పార్లమెంటునీ…పార్టీని వదలనని రఘురామకృష్ణం రాజు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుంది….ఈ ఉత్కంఠభరిత ఎపిసోడ్ క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అన్న విషయం చర్చనీయాంశమైంది.

ఆర్ ఆర్ ఆర్ ఎపిసోడ్ క్లైమాక్స్ దాదాపుగా ఢిల్లీలో జరిగే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చేతిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ ఎపిసోడ్ పూర్తయితే మరో విషయంపై కూడా పూర్తి క్లారిటీ రానుంది. జగన్, బీజేపీ పెద్దల మధ్య కొంత గ్యాప్ ఉందని…టాక్ వస్తోంది. అయితే, బహిరంగంగా మాత్రం….బీజేపీపై వైసీపీ నేతలు విమర్శలు చేసిన దాఖలాలు లేదు. ఇక, నత్వానీకి వైసీపీ కోటాలో రాజ్యసభ సీటు దక్కడంతో బీజేపీ, వైసీపీల మధ్య బంధం బాగానే ఉందని స్పష్టమవుతోంది.

మరోవైపు కేంద్రంతో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు, నేతలు సఖ్యతగానే ఉంటున్నారు. అరకొరగా ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నాయకులు చేసే కామెంట్స్….రాష్ట్ర రాజకీయాల్లో భాగంగా చూడాలని గతంలో బీజేపీ నేతలు హింట్ ఇచ్చారు. ఒకవేళ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు పడితే సీఎం జగన్ కు కేంద్రంలో పూర్తి పట్టున్నట్టు స్పష్టమవుతుంది. ఈ వ్యవహారంలో వైసీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే జగన్ కు బీజేపీ పెద్దల అండ ఉన్నట్లే. ఒకవేళ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడకపోతే బీజేపీకి జగన్ కి మధ్య దూరం బాగా పెరిగినట్టు చెప్పకనే చెప్పినట్లవుతుంది.

ఏది ఏమైనా…ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్ కు జగన్ త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట. అందుకే, చెప్పులో రాయిలా మారిన రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని జగన్ ఫిక్స్ అయ్యారట. నా బలం మీదే నేను గెలిచాను…వైసీపీ బలంతో కాదు అని చెబుతోన్న రఘురామకృష్ణం రాజుకు…ఎవరి బలమేంటో చూపించాలని జగన్ అనుకుంటున్నారట. అందుకే, ఎన్నికల బరిలోనే బలాబలాలు తేల్చుకోవాలని జగన్ ఈ ఎత్తు వేశారట.

ఆర్ఆర్ఆర్ ను అడ్డం పెట్టుకుని విపక్షాలు అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా…తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనుకోవడాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారట. అందుకే, గతంలో తానిచ్చిన మాట ప్రకారమే…అనర్హతపడ్డవారిని ఎన్నికల బరిలోనే ఎదుర్కోవాలని జగన్ సిద్ధమవుతున్నారట. మరి, ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే మరి కొన్నిరోజులు ఓపిక పట్టాల్సిందే.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content