ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు అసెంబ్లీలో ఒకటికి రెండుసార్లు తీర్మానం జరిగింది. మండలిలో బ్రేక్ పడినా.. దాన్ని రద్దు చేసి అయినా తీర్మానం పాస్ అయిపోయేలా చేయడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేందుకు భవనాలు సిద్ధమవుతున్నాయి.
పేరుకు శాసన రాజధానిగా అమరావతి ఉన్నప్పటికీ.. దాన్ని నామమాత్రం చేయడానికి జగన్ సర్కారు ఏం చేయాలో అన్నీ చేస్తోంది. కరోనా వల్ల బ్రేక్ పడింది కానీ.. లేకుంటే ఈపాటికి కచ్చితంగా రాజధాని అమరావతి నుంచి తరలిపోయేదన్నది స్పష్టం. ఆ తర్వాత అయినా రాజధాని తరలింపు లాంఛనమే అని భావిస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా భాజపా ఎంపీ సుజనా చౌదరి చెప్పిన మాటే మళ్లీ చెబుతున్నారు.
ఇంతకుముందు అన్నట్లే Sujana Chowdary మరోసారి.. ‘రాజధాని అమరావతి నుంచి అంగుళం కూడా కదలదు’ అని ప్రకటన చేయడం విశేషం. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి 200 రోజులు పూర్తి అయిన నేపథ్యంలో సుజనా చౌదరి ట్విట్టర్లో స్పందించారు.
‘‘నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.’’ అని సుజనా ట్వీట్ చేశారు.
ఐతే కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని సుజనా ఎప్పట్నుంచో పాడిన పాటే పాడుతున్నారు కానీ.. ఇప్పటిదాకా కేంద్రం రాజధాని తరలింపు విషయంలో ఏమీ మాట్లాడలేదు. ఓవైపు భాజపాకే చెందిన మరో ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదని అంటుండగా.. సుజనా మాత్రం మళ్లీ మళ్లీ అదే మాట అంటుండటం.. ఆ మాటలు చేతలయ్యే అవకాశాలే కనిపించకపోవడం గమనార్హం.