ఏపీలో అర‌డ‌జ‌ను మంది మంత్రుల‌కు ఇదే ప‌ని

మంత్రి అంటే.. ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను.. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన అధికారుల‌తో అమ‌లు చేయించ‌డం.. అవి స‌క్ర‌మంగా అమ‌ల‌వుతున్నాయో.. లేదో.. చూడ‌డం కీల‌క ప‌ని. అంతేకాదు.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే అర్జీల‌ను ప‌రిష్క‌రించ‌డం.. అవి ఏదశ‌లో ఉన్నాయో చూడ‌డం.. ప్ర‌జ‌ల‌కు కుదిరితే అందుబాటులో ఉండ‌డం కూడా అమాత్యుల విధుల్లో కీల‌క‌మైన వ్య‌వ‌హారం. అయితే.. ఏపీలో ఉన్న మంత్రులు ఈ విధుల‌ను ప‌క్క‌న పెట్టేశారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దాదాపు అర‌డ‌జ‌ను మంది మంత్రులు వారం వారం.. ప‌నిగ‌ట్టుకుని తిరుమ‌ల బాట ప‌డుతున్నారు.

తామే కాదు.. త‌మ అనుచ‌రుల‌నుకూడా తీసుకువెళ్తూ.. హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. దీంతో ఏపీ మంత్రుల‌కు ప‌నిలేదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అయితే.. రెండోసారి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌.. త‌ర్వాత వారం వారం ఆల‌యానికి వెళ్తున్నారు. ఆదిలో ఈయ‌న‌కు అతిథి మ‌ర్యాదలు బాగానే ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత‌.. టీటీడీ అధికారులు కూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసి.. కింది స్థాయి ఉద్యోగుల‌కు బాధ్య‌త అప్ప‌గించారు. అయినా.. ఈయ‌న మాత్రం మాన‌డం లేదు.. మార‌డ‌మూ లేదు.

ఇక‌, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి రోజా ప‌రిస్థితి కూడా ఇంతే. ప్ర‌తి 15 రోజుల‌కు ఠంచ‌నుగా.. తిరుమ‌ల బాట‌ప‌డు తున్నారు. త‌ను మాత్ర‌మేకాదు.. త‌న వెంట మందీ మార్బ‌లాన్ని కూడా తీసుకువెళ్తున్నారు. దీంతో తిరుమ‌ల అధికారులు విసుగు వ‌చ్చిందో ఏమో.. ఆమెనుకూడా ప‌క్క‌న పెట్టేశారు. అయినా.. ఆమె మాత్రం తిరుమ‌ల బాట వీడ‌డం లేదు. అదేవిధంగా మంత్రి నారాయ‌ణ స్వామి కూడా ప్ర‌తి 20 రోజుల‌కు ఒక‌సారి తిరుమ‌ల ద‌ర్శ‌నం త‌ప్ప‌నిస‌రి అన్న‌ట్టుగా వెళ్తున్నారు. ఆయ‌న కూడా కుటుంబాన్ని త‌న‌వెంట తీసుకువెళ్తున్నారు.

మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్‌, సీదిరి అప్ప‌ల రాజులు కూడా ప్ర‌తి 15 రోజులు లేదా నెల‌లో ఒక‌సారి ఠంచనుగా తిరుమ‌ల ద‌ర్శ‌నం చేయా ల్సిందే. దీంతో సాధార‌ణ భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌నేది మాత్రం వాస్త‌వం. శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం త‌ప్పుకాదు.. కానీ, ఇలా ప‌దే ప‌దే తిరుమ‌ల బాట ప‌ట్ట‌డం.. ఉన్న ప‌నిని వ‌దిలేయ‌డం.. వంటివే ఇప్పుడు మంత్రుల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి. గ‌తంలో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కూడా ఇలానే చేసేవారు. దీంతో పార్టీ అధిష్టానం ఆయ‌న‌ను క‌ట్ట‌డి చేసింది. మ‌రి మంత్రుల విష‌యంలో ఎందుకు ఉపేక్షిస్తోంద‌నేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. మంత్రుల వ్య‌వ‌హారంపై మాత్రం విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.