తెలుగు దేశం పార్టీ, జనసేనలు కూటమిలో కీలక భాగస్వాములు. బీజేపీతో జట్టు కట్టిన ఈ రెండు పార్టీలో ఏపీలో రికార్డు విక్టరీని సాదించాయి. 151 సీట్లతో బలీయంగా కనిపిస్తూ… వైనాట్ 175 అంటూ బరిలోకి దిగిన వైసీపీని కూటమి కేవలం 11 సీట్లకు పరిమితం చేసింది. తెలుగు నేల రాజకీయాల్లో ఘన విజయాన్ని నమోదు చేసి వైసీపీని చావు దెబ్బ కొట్టింది. ఈ విజయానికి బాటలు వేసింది ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అయితే.. రెండో వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. నాడు టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడును జగన్ సర్కారు అరెస్టు చేసి జైల్లో పెడితే… లోకేశ్, పవన్ లు బయట మంత్రాంగాన్ని నడిపించారు. తమతో పొత్తుకు బీజేపీని ఒప్పించారు.
లోకేశ్, పవన్ ల మధ్య బంధం నానాటికీ బలోపేతం అవుతుందే తప్పించి… ఇసుమంత విబేధాలు రాకుండా ఇద్దరు నేతలు సాగుతున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ ను తన సొంత అన్న మాదిరిగా పరిగణిస్తున్న లోకేశ్… పవన్ కు అత్యదిక ప్రాదాన్యత ఇస్తూ సాగుతున్నారు. అదే సమయంలో పవన్ కూడా ప్రతి విషయంలోనూ చంద్రబాబు మార్గదర్శకత్వంలో లోకేశ్ తో కలిసి సాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏదైనా అంశం గురించి పవన్ ఆలోచించారంటే దాని అంతు చూసేదాకా వదిలిపెట్టడం లేదు. ఈ విషయాన్ని బుధవారం లోకేశ్ తన ప్రసంగంలోనే విస్పష్టంగా విడమరచి మరీ చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధి దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్లాంట్ కు భూమి పూజ చేసిన సందర్భంగా లోకేశ్… పవన్ గొప్పతనాన్ని, మొండితనాన్ని… అంతిమంగా నిబద్ధతను కీర్తించారు.
పవన్ కల్యాణ్ తనకు తోడబుట్టిన సోదరుడి మాదిరి అని లోకేశ్ ప్రకటించారు. వేసవి వచ్చేసిందని… అక్కడక్కడా తాగు నీటికి కొరత ఏర్పడిందన్న మాటలు వినిపిస్తున్నాయని ప్రస్తావించిన లోకేశ్… తాగునీటి వసతి కల్పించే శాఖను ఎవరు చూస్తున్నారంటూ జనాన్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు తానే సమాధానం చెప్పిన లోకేశ్…తన అన్న పవన్ ఆ శాఖను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ”పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేం చర్చిస్తాం. తాగునీరు ఓ ప్రయారిటీ అని పవన్ అన్న ప్రతి కేటినెబ్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాసిరకమైన పనులు చేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టును టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. త్వరలోనే ఆగిపోయిన పనులన్నీ ప్రారంభిస్తాం. ప్రతి గడపకు కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తాం” అని లోకేశ్ తెలిపారు. లోకేశ్ నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు పవన్ నిబద్ధతకు అద్దం పట్టాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.