కూటమి పాలనలో ఏపీ రైజింగ్

రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం పెరగకపోగా…సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలితాలను ఇచ్చాయి. గత 11 నెలల జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే..గత నెల(మార్చి) జీఎస్టీ వసూళ్లు అత్యధిక వసూళ్లుగా నిలిచాయి.

జీఎస్టీ వసూళ్లలో కనిపించే పెరుగుదల గానీ, తరుగుదల గానీ… ఆయా రాష్ట్రాల్లో వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధితో పాటుగా రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందా?… లేదంటూ తిరోగమన దిశగా సాగుతోందా? అన్నదానిని నిర్ధారిస్తుంది. ఈ లెక్కన జీఎస్టీ వసూళ్లు పెరిగితే… రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్లే. మార్చి నెల జీఎస్టీ వసూళ్లను గమనిస్తే… గత 11 నెలల వసూళ్లలోనే మార్చి వసూళ్లే అత్యథికమని తేలింది. మార్చిలో ఏపీ జీఎస్టీ వసూళ్లు రూ.3,116 కోట్ల మేర వచ్చాయి.

ఇక ఈ వసూళ్లు గతేడాది ఇదే నెల వసూళ్లతో పోలిస్తే కూడా అధికమేనని చెప్పాలి. గతేడాది మార్చి జీఎస్టీ వసూళ్ల కంటే ఈ ఏడాది మార్చి జీఎస్టీ వసూళ్లు 8.35 శాతం మేర అధికమని తేలింది. దీంతో ఏ లెక్కన చూసినా మార్చి నెల జీఎస్టీ వసూళ్లు ఏపీ వృద్ధి పథాన పయనించడం మొదలుపెట్టిందన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లు అమలులోకి వచ్చిన నాటి నుంచి కూడా నమోదైన అత్యధిక వసూళ్లలో ఈ మార్చి నెల వసూళ్లు మూడో స్థానంలో నిలిచాయి. రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంటోదని చెప్పడానికి ఇది కూడా ఓ నిదర్శనమన్నవాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.