లోకేశ్ మరో హామీ అమలు.. ప్రకాశంలో సీబీజీకి భూమిపూజ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి తన యువగళం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మరో హామీని అమలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాల ప్రజలకు ఆయన హామీలు ఇస్తూ సాగిపోయారు. అందులో భాగంగా ఎడారి జిల్లాగా పరిగణిస్తున్న ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులు నింపుతానంటూ హామీ ఇచ్చారు. ఆ హామీని బుధవారం ఆయన అమలు చేసి చూపించారు. ప్రకాశం జిల్లాలోని పీసీ పల్లి మండలం దివాకరపల్లిలో రిలయన్స్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ కు లోకేశ్ భూమి పూజ చేశారు.

ప్రకాశం జిల్లాలో రిలయన్స్ కంపెనీ ఏకంగా 4 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. వీటి కోసం ఆ సంస్థ ఏకంగా రూ.600 కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ ప్లాంట్లతో పారిశ్రామికంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటుగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. వాస్తవానికి రిలయన్స్ సంస్థ ఏపీలో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కలిసి కూటమి కట్టిన టీడీపీ ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంటనే రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా లోకేశ్ చురుగ్గా కదిలారు. ఈ క్రమంలో సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు దిశగా రిలయన్స్ భారీ ప్రణాళికలు రచించిందని తెలుసుకుని…ఆ కంపెనీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపారు. ఏపీ కేంద్రంగా సీబీజీ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ఆయనను ఒప్పించారు.

లోకేశ్, అనంత్ అంబానీల మధ్య ప్రాథమిక చర్చలు పూర్తి కాగానే… ఏపీకి వచ్చిన అనంత్ అంబానీ తండ్రి ముఖేశ్ అంబానీ… ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నారు. ఏపీలో 500 మేర సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్లాంట్ల కోసం రూ.65 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లుగా కూడా సీనియర్ అంబానీ ప్రకటించారు. ఈ ప్లాంట్లన్నీ పూర్తి అయితే రాష్ట్రానికి చెందిన 2.5 లక్సల మంది యువతకు ఉపాధి లభిస్తుందని కూడా అంబానీ తెలిపారు. తమ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీని కేంద్రంగా చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా పరిధిలోని కనిగిరి నియోజకవర్గంలోని దివాకరపల్లిలో సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ రంగం సిద్ధం చేయగా… లోకేశ్ దానికి బుధవారం భూమి పూజ చేశారు.