జగన్ కు ముద్రగడ రిక్వెస్ట్ కమ్ డిమాండ్

Mudragada

కాపు రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత నేటి ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లకు వైసీపీ పూర్తి మద్దతునిచ్చినందుకే తుని రైలు దహనం ఘటనలో వైసీపీ నేతలను ఇరికించారని కూడా జగన్ గతంలో ఆరోపించారు. కాపులకు అండ‌గా నిలుస్తాన‌ని, బీసీల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా…కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు.

అయితే, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ కాపుల రిజర్వేషన్ల అంశం పరిష్కారం కాకపోవడంతో కాపు నాయకుల్లో కొంత అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత, ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ చర్చనీయాంశమైంది. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్…తమను మాత్రం పట్టించుకోవడం లేదని ముద్రగడ ఆరోపించారు.

ఓ వైపు వైఎస్ ఆర్ తరహాలో జగన్ కూడా నీరాజనాలు అందుకోవాలని అంటోన్న ముద్రగడ….మరో వైపు మాత్రం సీఎం పదవిని మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దంటూ జగన్ కు సున్నితమైన వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

కాపుల రిజర్వేషన్ల విషయంలో జగన్ తన చిత్త శుధ్దిని నిరూపించుకోవాలని, తమ జాతి సమస్యను తీర్చే దిశగా ప్రధాని మోడీతో చర్చలు జరపాలని సీఎం జగన్‌ను ముద్రగడ కోరారు. జగన్ సీఎం అయిన తర్వాత అడిగిన వారికి, అడగని వారికి అందరికీ దానకర్ణుడిలా దానాలు చేస్తున్నారని….కానీ, కాపు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు చొరవ చూపించడం లేదని ప్రశ్నించారు. జగన్ సీఎం కావడం వెనుక కాపు జాతి మద్దతు కూడా ఉందని ముద్రగడ గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జగన్ కూడా కాపులతో సహా ప్రజలందరితో పూజలందుకోవాలని అన్నారు.

అయితే, కాపు రిజర్వేషన్ల వంటి అంశాలను పరిష్కరించకుంటే సీఎం పదవి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలే అవకాశముందని….ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఇన్నాళ్లూ మౌనంగా వేచి ఉన్న ముద్రగడ…తొలిసారిగా జగన్ కు రాసిన రిక్వెస్ట్ కమ్ డిమాండ్ కమ్ వార్నింగ్ లెటర్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

జగన్ కు ముద్రగడ లేఖ వెనుక బీజేపీ నేతల హస్తం ఉందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ముద్రగడను తెరపైకి తెచ్చారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి, ఈ లేఖపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.