చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌పాటే..

రాజ‌కీయాల్లో రోజుల‌న్నీ.. ఒకే విధంగా ఉండ‌వు. నిన్న ఉన్న‌ట్టుగా ఈ రోజు.. ఈ రోజు ఉన్న‌ట్టు రేపు కూడా ఉండే అవ‌కాశం లేదు. ఈ విష‌యాన్ని నాయ‌కులు గ్ర‌హించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా.. త‌మ త‌మ విధానాల‌ను మార్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాత్రం ఇలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. పార్టీ అధినేత  చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. నాయ‌కులు పెడ‌చెవిన పెడుతున్నారు.

ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌ని.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని.. వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని.. ఇలా అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది నాయ‌కుల్లో మార్పు రాలేదు. ఇక‌, ఇప్పుడు.. మ‌రోసారి నాయ‌కు ల‌కు త‌లంటే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అంతా కూడా.. నాయ‌కుల‌ను త‌న ద‌గ్గ‌ర‌కు పిలుచుకుని.. వారికి దిశానిర్దేశం చేయాల‌ని భావించారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు.. ఇత‌ర నాయ కుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. వీటిలో కీల‌క‌మైన పెన‌మ‌లూరు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ యంలో సంత‌నూత‌ల‌పాడు.. కూడా.. ఉంది. అయితే.. తాజాగా భేటీలోనూ చంద్ర‌బాబు పాడిందే పాట అన్న‌ట్టుగా.. నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌డంతోనే స‌రిపుచ్చారు. ఎక్క‌డా వారికి ఎలాంటి వీస‌మెత్తు హెచ్చ‌రిక కూడా చేయ‌లేదు.

మీరు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే.. టికెట్లు ఇచ్చేది లేద‌ని.. సాక్షాత్తూ ఎమ్మెల్యేలకే వైసీపీ అధినేత జ‌గ‌న్ హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు. దీంతో టికెట్ల‌పై బెంగ‌తోనో.. లేక‌.. అధినేత ఆదేశాలంటే.. గౌర‌వంతోనో.. వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. కానీ, ఇలాంటి ప‌రిస్థితి టీడీపీలో క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు చెప్పింది వింటున్నారు.. త‌ల‌లు ఊపుతున్నారు. త‌ర్వాత‌.. ఎవ‌రి మానాన వారు త‌మ త‌మ ప‌నుల్లో మునిగితేలుతున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి మారాలంటే.. కొంత చంద్ర‌బాబు కూడా మారాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నాయ‌కుల‌కు బ‌ల‌మైన సంకేతాలు.. పంపాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.