జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటు ఆవేశపూరిత ప్రసంగాలు.. డైలాగులే కాదు.. అటు సోషల్ మీడియా లోనూ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయంగా ఆయన సంధించే చిన్నచిన్న విషయాలు.. సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై చురుక్కు-చమక్కు అనిపించేలా.. పవన్ సంధించే కార్టూన్లు.. కామెంట్లు.. అదిరిపోయే రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. నెటిజన్ల నుంచి లైకులు పడేలా చేస్తుంటాయి.
సమయానికి తగిన విధంగా పవన్ స్పందించే తీరుకు.. ప్రజల నుంచి కూడా అంతే స్పందన వస్తోంది. గతంలో రోడ్ల నిర్మాణంపై.. జనసేన అధినేత సంధించిన కామెంట్లు.. ప్రజల మనసును తాకాయి. తర్వాత.. కాలంలో ఆయన సోషల్ మీడియాలోనూ.. ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. విషయం ఏదైనా.. కూడా రెండు మూడు వాక్యాల్లో.. సూటిగా.. సుత్తిలేకుండా.. ఆయన చెప్పే తీరుప్రజలకు బాగా ఎక్కుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చేసిన ట్వీట్ భారీ ఎత్తున వైరల్ అవుతోంది.
ఏపీ సర్కారు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ముఖ హాజరు యాప్‌ను ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు ఉన్న మాన్యువల్ విధానంలో అవకతవకలు జరుగుతున్నాయని.. స్కూల్‌కు రాకుండానే వచ్చినట్టు.. హాజరు వేస్తున్నారని.. ఇలాంటి వాటిని అరికట్టేందుకు.. ముఖ హాజరు యాప్‌ను తీసుకువచ్చినట్టు సర్కారు చెబుతోంది. ఉపాధ్యాయులు దీనిలోనే హాజరు వేయాలని.. ఒక్క నిముషం కూడా లేటుగా రావడానికి వీల్లేదని.. జీపీఎస్ విధానంలో కనెక్ట్ అయిన..ఫోన్‌తోనే స్కూల్ వద్ద ముఖ హాజరు వేసుకోవాలని.. ఆదేశించింది.
ఈ విధానం వివాదంగా మారి.. ఉపాధ్యాయులు.. ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. అయితే.. దీనిపై తాజా గా స్పందించిన జనసేనాని పవన్.. ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉపాధ్యాయుల నిబద్ధతకు.. పారదర్శకతకు కొలమానంగా.. యాప్‌ను తీసుకువచ్చామని.. ప్రభుత్వం చెబుతోందని.. అదేవిధంగా వైసీపీ ప్రజాప్రతి నిధుల పారదర్శకతకు.. వారి నిజాయితీకి.. కొలమానంగా ప్రజలు కూడా ఒక యాప్ తీసుకువచ్చి.. వైసీపీ ఎమ్మెల్యేలు.. ఎంపీలకు మార్కులు వేస్తే.. బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌కు ఒక కార్టూన్‌ను కూడా పవన్ జత చేయడం విశేషం. అయితే.. ఇది క్షణాల్లో భారీగా వైరల్ కావడం గమనార్హం.