ఒకే వేదిక‌పైకి బాబు, ప‌వ‌న్‌?

మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా నాయ‌కులు కూడా మారతున్నారు. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మార్పు త‌థ్య‌మంటూ.. త‌ర‌చుగా నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌న్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దానికి అనుగుణంగానే చ‌క్రం తిప్పు తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ అనూహ్యంగా బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

ఈ ప‌రిణామం త‌ర్వాత ఏపీలోను.. అటు ఢిల్లీలోనూ రాజకీయాలు మారుతున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు కూడా త్వ‌ర‌లోనే ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌ని.. ఈ ద‌శ‌లో బీజేపీ అగ్ర నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయ‌న భేటీ అవుతార‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే.. నిన్న మొన్నటి వ‌ర‌కు ప్ర‌ధాని మోడీ గురించి మాట మాత్రం కూడా మాట్లాడ‌ని.. చంద్ర‌బాబు.. తాజాగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లో ప్ర‌ధానిని ఆకాశానికి ఎత్తేశారు.

ఆయ‌న వ‌ల్ల దేశంలో అభివృద్ధి బాట‌లో ప‌య‌నిస్తోంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాదు.. కేంద్రం పెట్టుకున్న పాతికేళ్ల ల‌క్ష్యాన్ని చంద్ర‌బాబు కూడా మ‌రోసారి ప్ర‌వ‌చించారు. అంటే.. దాదాపు బీజేపీకి అను కూలంగానే చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నార‌నే సంకేతాలు దాదాపు వ‌చ్చాయి. మ‌రోవైపు.. నిన్న మొన్న‌టి వ‌రకు టీడీపీ అంటే నిప్పులు చెరిగిన బీజేపీ నాయ‌కుడు సోము వీర్రాజు సైతం.. తాజాగా టీడీపీపై సానుకూల వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం అంతో ఇంతో అభివృద్ధి చేసిందంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలావుంటే.. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ముందుగానే జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ నాయ‌కులు గెట్ టుగెద‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇది ద‌స‌రా లోపు గానీ.. ద‌స‌రాకు గానీ ఉంటుంద‌ని.. తాజాగా పార్టీ నేత‌ల మ‌ధ్య చర్చ సాగుతోంది. ఇప్ప‌టికే.. కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు కొన్ని సంకేతాలు వ‌చ్చాయ‌ని.. చంద్ర‌బాబు, టీడీపీల విష‌యంలో సానుకూల‌త ప్ర‌ద‌ర్శించాల‌నే ఆదేశాలు అందాయ‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడు వీరు క‌లుసుకుని.. చ‌ర్చించ బోయే విష‌యాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.