ఈసారి కూడా లోకేష్‌ ఓట‌మి ఖాయం: ఏపీ మంత్రి

పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నా రని, అందుకే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటలకు, చేసిన ఎంవోయూలకు పొంతనే లేదని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని అభివర్ణించిన మంత్రి అమర్నాథ్‌.. నేపాల్‌ గుర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన ఘనత చంద్రబాబుదని, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒకవైపు తాము అభివృద్ధి చేస్తుంటే.. ప్రతీది తామే చేశామంటూ చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని, ప్రజలు అంతా గమనిస్తుంటారని చంద్రబాబు, నారా లోకేష్‌లకు హితవు పలికారు.

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వడంలో మేం రాజీపడడం లేదన్నారు. ఎంఎస్‌ఎంఈలకు పాత బకాయిలు కూడా ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్థంబాల మీద సీఎం జగన్‌ పాలన కొనసాగుతోందని, పరిశ్రమల ఏర్పాటు.. ఉపాధి కల్పన ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు.

లోకేష్‌కు మంగ‌ళ‌గిరిలో ఈ సారి కూడా ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బ్రాహ్మ‌ణితో ఏదైనా వివాదం ఉంటే.. ఇంట్లో తేల్చుకోవాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు అప్ప‌ట్లో తీర ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉన్న వ‌న‌రుల‌ను గుర్తించి.. అన్ని ర‌కాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న‌ట్టు తెలిపారు. గ‌తంలో 150 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి.. చేసిన హంగామాతో ఎలాంటి పెట్టుబ‌డులు వ‌చ్చాయో చెప్పాల‌ని నిల‌దీశారు.