కేసీఆర్ మాట్లాడినా వ్యూహమే. మాట్లాడకపోయినా వ్యూహమే. ఆయన అధికారికంగా ఏదైనా ప్రకటన చేసినా దానికో లెక్క ఉంటుంది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ విషయంలో ఆయన వైఖరి లక్షలాది మందిని బుక్ చేసేలా ఉందంటున్నారు.
ఇంతకీ ఎందుకు ఆ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే….జూన్ 28న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పాజిటివ్ కేసుల ఉధృతిని అడ్డుకోవచ్చని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతిపాదించింది. లాక్ డౌన్ అంశంపై మూడునాలుగు రోజుల్లో కేబినెట్ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలా ప్రకటించి ఐదు రోజులవుతున్నా ఎలాంటి నిర్ణయం జరుగలేదు. ఇదే సమయంలో…మళ్లీ లాక్డౌన్ ఉండొచ్చన్న వార్తలతో ఐదురోజులుగా వలసజీవులు హైదరాబాద్‌ను ఖాళీ చేసి సొంతూళ్ల బాట పట్టారు. లాక్డౌన్ పెడితే తమకు పూటగడవడం కష్టమవుతుందని గ్రేటర్‌లోని చిన్న చిన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ లాక్ డౌన్ పెట్టాలా? వద్దా? అనే విషయంపై రాష్ట్ర సర్కారు ఎటూ తేల్చుకోలేకపోతున్నది.
మళ్లీ లాక్ డౌన్ విధిస్తామనే ప్రకటన ప్రజలను అలర్ట్ చేసింది. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. బిజీగా ఉండే ప్రాంతాలు కూడా బోసిపోతున్నాయి. చాలా చోట్ల వ్యాపారస్తులు సెల్ఫ్ లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు. కిరాణ షాపు ఓనర్లు, సూపర్ మార్కెట్లు, హోటల్ నిర్వాహుకులు, చిన్నచిన్న వ్యాపారుల వరకు లాక్ డౌన్ ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డైలమాలో ఉంది. ప్రభుత్వం వైఖరి ఏంటనే విషయం తెలియక….ప్రజలు సతమతం అవుతున్న తరుణంలో అధికారికంగా సమాచారం ఇస్తే మేలని….ఎప్పట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం సరికాదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates