దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఇప్పటివరకు దేశ ప్రధానులుగా 15 మంది వ్యవహరించారు. ఇందులో దేశ మొదటి ప్రధానమంత్రిగా వ్యవహరించిన జవహర్ లాల్ నెహ్రూ అత్యధిక కాలం పాలించారు. స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 నుంచి ఆయన మరణించే 1964 మే వరకు ఆయన పాలనే సాగింది. 16 సంవత్సరాల 286 రోజులు ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా వ్యవహరించింది ఇందిరా గాంధీనే. ఆమె 11 సంవత్సరాల నాలుగు నెలల పాటు ప్రధానిగా వ్యవహరించారు. ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది కారణంగా హత్యకు గురి కావటంతో ఆమె ప్రస్థానం ముగిసింది. లేదంటే మరిన్ని సంవత్సరాలు ఆమె ప్రధానిగా వ్యవహరించేవారు. ఆ తర్వాత చూస్తే.. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రధానిగా పని చేశారు.
ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీనే అని చెప్పాలి. వయసు రీత్యా.. దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ ను పరిగణలోకి తీసుకున్నా.. నెహ్రూ రికార్డును బ్రేక్ చేస్తారా? లేదా? అన్నది సందేహమే అయినా.. ఇందిరాగాంధీ రికార్డును మాత్రం అధిగమించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రధానిగా రెండో టర్మ్ లో ఉన్న ఆయన.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావటం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూరేలా సర్వే ఫలితాలు ఉన్నాయి.
దేశ ప్రధానమంత్రి హోదాలో మోడీ ఇప్పటికి ఎనిమిది సార్లు పంద్రాగస్టు సందర్భంగా ఎర్ర కోట మీద నుంచి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ఎనిమిది సార్లు.. ఆయన ధరించిన దుస్తులు అందరిని ఆకర్షించాయి. దీనికి కారణం లేకపోలేదు. దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో అత్యంత విలాసవంతమైన ప్రధానిగా నెహ్రూను చెప్పేవారు. అలా అని ప్రజా సొమ్మును వేస్టు చేశారన్నది చెప్పటం మా ఉద్దేశం కాదు. ఆయన తర్వాత తన చేతలతో వార్తల్లో నిలిచిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీనే అవుతారు.
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన ధరించే దుస్తులు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. అప్పట్లో అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ సతీమణి కంటే ఎక్కువసార్లు డ్రెస్సులు ఛేంజ్ చేసిన మోడీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. వాటిని పట్టించుకోకుండా.. తన కలెక్షన్ ను కంటిన్యూ చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా నిన్నటి పంద్రాగస్టు సందర్భంగా ఆయన ధరించిన దుస్తులు మరోసారి ఆయన వస్త్రధారణ మీద చర్చకు తెర తీశాయి. స్టైలిష్ వస్త్రధారణతో ఎర్రకోటకు వచ్చిన ఆయన.. ఆయన దుస్తులతో పాటు..ఆయన ధరించిన తలపాగా అందరికి ఎక్కువగా ఆకర్షించింది. జాతీయ జెండా రంగులతో పోలిన పాగాను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక.. ఎనిమిదేళ్లలో పంద్రాగస్టు సందర్భంగా ఆయన పసుపు చొక్కాను ధరించటం కనిపిస్తుంది.
మూడు సార్లు ఆయన పసుపు రంగు షర్ట్ ను ధరిస్తే.. పసుపు రంగు తలపాగాను నాలుగుసార్లు ధరించారు. కాషాయ పాగాను రెండుసార్లు.. పసుపు.. ఎరుపు కాంబినేషన్ లో మరో తలపాగా.. గులాబీ వర్ణంలో ఉన్న పాగా ఒకసారి.. తాజాగా త్రివర్ణ పతాకాన్ని గుర్తుచేసేలా మరో తలపాగాను ఆయన ధరించారు. కండువాల విషయంలోనూ ఆయన ఎప్పటికప్పుడు భిన్నంగా వ్యవహరించేవారు. ఈసారి మాత్రం ఆయన మెడలో కండువాను వేసుకోలేదు ఎనిమిది సార్లలో ఐదుసార్లు ఆయన మెడలో కండువా లేకుండా హాజరయ్యారు. మిగిలిన మూడు సందర్భాల్లోనూ ఆయన ధరించే కండువాలు వైట్ కలర్ లో ఉండి.. వాటికి ఆకర్షణీయమైన డిజైన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. మొత్తంగా స్టైలీష్ లుక్ తో ఆకట్టుకున్న దేశ ప్రధానుల్లో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉంటారని మాత్రం చెప్పక తప్పదు.