రఘురామకృష్ణం రాజు ఆత్మ వేరే పార్టీలో ఉంది

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఖరి ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రఘురామకృష్ణరాజుకు విజయసాయిరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌పై షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. షోకాజ్ కు సమాధానమిచ్చే క్రమంలో…వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్న పేరు వైసీపీ వాడకూడదన్న వాదనను రఘురామ తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా, తనకు వైసీపీ శ్రేణుల నుంచి ప్రాణహాని ఉందని… కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్ను, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, కిషన్‌రెడ్డిలను ఆయన అభ్యర్థించారు. దీంతో, స్వపక్షంలో విపక్షంగా మారిన ఆర్ ఆర్ ఆర్ ను సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలని వైసీపీ అధిష్టానం భావించింది. అందుకే, హుటాహుటిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీలో కలిసింది. ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లయిట్ లో వెళ్లి మరీ ఓం బిర్లాతో వైసీపీ ఎంపీలు భేటీ కావడం చర్చనీయాంశమైంది.

రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఓం బిర్లాను వైసీపీ ఎంపీలు కోరారు. స్పీకర్ ను కలిసిన వారిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లావు కృష్ణదేవరాయ, మార్గాని భరత్, నందిగం సురేష్ ఉన్నారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందుకే, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ ఓం బిర్లాను ఎంపీలు కోరారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ను సమర్పించామని విజయసాయి చెప్పారు. స్పీకర్ అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడ్ని గౌరవించకపోవడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలకు పాల్పడి స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రఘురామకృష్ణరాజు భౌతికంగా వైసీపీలో ఉన్నా, ఆయన హార్ట్ అండ్ సోల్ ఇక్కడ లేదని అన్నారు.

వైసీపీకి పక్కలో బల్లెంలా, కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణంరాజును వీలైనంత త్వరగా వదిలించుకోవాలని వైసీపీ పెద్దలు భావించారు. ఇప్పటికే అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకొని చార్టెడ్ ఫ్లయిట్ వేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు జగన్ మరో 20 ఏళ్లు సీఎం అంటూనే…పార్టీపై విమర్శలుగుప్పిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై చర్యలు తీసుకునేందుకు వైసీపీ వేగంగానే పావులు కదిపింది. వాస్తవానికి అత్యవసర పనులు….అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలకే చార్టెడ్ ఫ్లయిట్ వాడతారు. కానీ, ఓ ఎంపీపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లయిట్ వాడారంటే….ఆర్ ఆర్ ఆర్ ఎపిసోడ్ కు వెంటనే పుల్ స్టాప్ పెట్టాలని…వైసీపీ అధిష్టానం భావిస్తోందని చెప్పవచ్చు.