పవన్ అంత ధైర్యం చేస్తారా?

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా ఎంఎల్ఏలు, ఎంపీలను టార్గెట్ చేస్తు కూడా మాట్లాడారు. పనిలోపనిగా జనాలందరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు వ్యతిరేకంగా జనాలు ఉద్యమించాలని పిలుపిచ్చారు. పవన్ పిలుపు ప్రకారం జనాలు ఉద్యమాలు చేసేదుండదు, ప్రభుత్వం స్కీములను ఆపేదుండదని అందరికీ తెలుసు.

స్కీములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ తాను అధికారంలోకి వస్తే వాటన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటిస్తే సరిపోతుంది. ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములైనా జనాలను ఉద్దరించటానికే అని చెప్పుకుంటాయి. కాకపోతే అలాంటి పథకాలు ఎలా అమలవుతున్నాయన్నదే కీలకం. పథకం అమలులోనే అవినీతి, అక్రమాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవినీతి, అక్రమాలను నూరుశాతం కాకపోయినా వీలైనంతగా కంట్రోల్ చేయగలిగితే అర్హులైన లబ్దిదారులకు అందుతాయి.

ఇపుడు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు లక్షలకొద్దీ లబ్దిదారులకు అందుతోందని జగన్ చెప్పుకుంటున్నారు. ఒకవేళ జగన్ చెప్పేది అబద్ధమని అనుకుంటే అదే విషయాన్ని నిరూపించచ్చు. లేదా పథకాల అమలులో అవినీతి, అక్రమాలు జరుగుతుంటే దాన్నే బయటపెట్టవచ్చు. లేదా అసలు పథకాలే దండగని పవన్ అనుకుంటే పలానా పథకాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించవచ్చు. ఇవన్నీ మానేసి సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఉద్యమించమని పిలుపివ్వటంలో అర్ధమేలేదు.

వచ్చే ఎన్నికల్లో పలానా పథకాన్ని ఎత్తేస్తామని లేదా జగన్ గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నాలను రద్దు చేసేస్తామని కూడా ప్రకటింవచ్చు. నవరత్నాల రద్దు అంశాన్ని కూడా పవన్ కీలకంగా చెప్పుకుని వచ్చే ఎన్నికల్లో పోరాటం చేయవచ్చు. పవన్ ప్రకటనకు సానుకూలంగా స్పందించే జనాలంతా జనసేనకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనాలు జనసేనకు ఓటేయండని అడిగితే ఎవరూ వేయరు. ఎంతసేపు జగన్నే తిడుతుంటే అసలు ఓట్లేయరు. జనాలు ఓట్లేయాలంటే జగన్ ప్రభుత్వం కన్నా తాను మెరుగైన పాలన అందిస్తానని చెప్పి జనాలను మెప్పించగలిగితేనే జనాలు ఓట్లేస్తారు.