ఆయన సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి కూడా. కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు కూడా ఉంది. అయితే.. ఇవన్నీ.. నిన్నటి నిజాలు. కానీ..ఇప్పుడు ఆయన చుట్టూ.. నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారనే వాదన హల్చల్ చేస్తోంది. అంతేకాదు.. ఆయన వల్ల ఏ పార్టీకి ప్రయోజనం? అంటూ.. నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి .. కొత్తపల్లి సుబ్బారాయుడు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా సంధి దశలో ఉన్నారు. వైసీపీ నాయకుడిగా ఉన్నా.. ఆయన మాత్రం పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసుకున్నారు.
అయినదానికి కానిదానికి ప్రభుత్వంపై చేసిన విమర్శలు.. ఆయనను ఏకాకిని చేశాయి. పైగా.. సొంత పార్టీ నేతలే ఆయనను పక్కన పెట్టేసే పరిస్థితిని కల్పించుకున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఆయనను సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం .. టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే.. ఇదే విషయం ఇప్పుడు టీడీపీలోనూ చర్చకు దారితీస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని.. టీడీపీ నేతలు సైతం.. బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కారణం.. గతంలో ఈ పార్టీలోనూ.. ఆయన తన ఇష్టానుసారం వ్యవహరించడమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు కొత్తపల్లి రాజకీయం ఎటు మలుపుతిరుగుతుందో చూడాలి.
తాజా పరిణామాలను గమనిస్తే… కొత్తపల్లి సుబ్బారాయుడు మౌనం వీడారు. మూడు నెలలుగా ఆయన సబ్ధతగా ఉంటూ ఉన్నారు. పలకరింపులు, పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలకే పరిమితమయ్యారు. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో కొత్తపల్లి రాజకీయంపై ఆసక్తికర చర్చ నెలకొంది. అయితే ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో తాజాగా ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీలో చేరే విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారన్నదానిపై ఆసక్తికర చర్చకు తెరతీసింది.
గత ఎన్నికల వరకు కొత్తపల్లి టీడీపీలో కొనసాగారు. చివరి నిముషం వరకు టిక్కెట్ ఆశించినా బండారుకు టిక్కెట్ ఇవ్వడంతో పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. రెండున్నర ఏళ్లు ఆ పార్టీలో కీలకంగా వ్యవహారించారు. ఆ తర్వాత కోఆప్షన్, షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో తలెత్తిన విభేదాలు భగ్గుమన్నాయి. ఇది వీడకుండానే జిల్లా కేంద్రం భీమవరం తరలిపోవడంతో జేఏసీ చేపట్టిన ఆందో ళనలో కొత్తపల్లి కీలక భూమిక పోషించారు. జిల్లా కేంద్రం తరలివెళ్లడం ఎమ్మెల్యే ముదునూరి అసమర్థతతే కారణమంటూ ఆరోపణలు చేశారు.
ఈ తర్వాత కొన్ని రోజులకు తన నివాసంలో విలేకరుల సమావేశం పెట్టి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలో మరోమారు ముదునూరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి కొత్తపల్లి సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. అయితే.. ఇటీవల కొన్నాళ్లుగా చంద్రబాబుకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంబించారు. కొన్ని రోజుల కిందట నందమూరి కుటుంబానికి చెందిన ఉమామహేశ్వరి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీనిని బట్టి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారనే వాదన వినిపించింది. కానీ, స్థానిక నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. కొత్తపల్లిని చేర్చుకోవద్దని అంటున్నారు. మరి చంద్రబాబు ఏంచేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates