మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టినట్లులేదు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మాట్లాడుతు రాజధాని స్ధాయిలో పరిపాలనా వికేంద్రీకరణే తమ విధానంగా చెప్పారు. ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతాల ఆత్మగౌరవానికి మూడురాజధానుల ఏర్పాటే పునాదిగా జగన్ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి చాలాకాలంగా పక్కనపెట్టేశారు. ఎప్పుడైతే హైకోర్టు జగన్ ప్రతిపాదనను అడ్డుకుందో అప్పటినుండి ప్రభుత్వం ఈ విషయంపై పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు.
హైకోర్టు జగన్ ప్రతిపాదనను కొట్టేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడినపుడు సమగ్ర బిల్లును మళ్ళీ తీసుకొస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనపై ఎలాంటి కదలిక లేకపోవటంతో ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయిందని చాలామంది అనుకున్నారు. అయితే తాజా ప్రకటన విన్న తర్వాత జగన్ ఆలోచనల్లోనుండి మూడు రాజధానుల అంశం తొలగిపోలేదన్న విషయం అర్ధమైపోతోంది. ఇదే సమయంలో వీలైనంత తొందరలో తన క్యాంపాఫీసును వైజాగ్ కు తీసుకెళిపోతారనే ప్రచారం మొదలైంది.
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పనిచేస్తే అక్కడే క్యాంపాఫీసుగా అనుకోవాలి. మూడు రాజధానుల ఏర్పాటును అయితే హైకోర్టు అడ్డుకున్నది కానీ సీఎంను పలానా చోటే కూర్చుని పనిచేయాలని ఏ కోర్టు కూడా చెప్పలేదు. ఈ పద్దతిలోనే జగన్ తొందరలోనే విశాఖపట్నం వెళిపోతారనే ప్రచారం ఊపందుకుంటోంది. అదే జరిగితే తన ఆలోచనను పరోక్షంగా పాక్షికంగా జగన్ సాకారం చేసుకున్నట్లే అనుకోవాలి. పూర్తిస్ధాయిలో పరిపాలనా రాజధానిని విశాఖపట్నంకు తీసుకెళ్ళలేకపోయిన జగన్ కేవలం తన క్యాంప్ ఆఫీసును మాత్రమే తీసుకెళ్ళినట్లవుతుంది.
మొత్తం మీద జగన్ తన మనసులోని ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బయటపెట్టినట్లయ్యింది. ఆలోచనను అయితే బయటపెట్టారు కానీ కార్యాచరణ రూపంలో ఎప్పుడు చూపిస్తారనేది సస్పెన్సుగా మారింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆలోచనలకు జగన్ పదునుపెట్టడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో లబ్ది జరుగుతుందని అనుకుంటే కచ్చితంగా మూడు రాజధానుల అంశాన్ని ఏదోరూపంలో అమల్లోకి తీసుకురావటానికే ప్రయత్నిస్తారనటంలో సందేహంలేదు. కాకపోతే అది వాస్తవంలో సాధ్య పడుతుందో లేదో ఎవరూ చెప్పలేరు.