జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పవన్ సందర్భానుసారంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో పాటు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏడాది కాలంగా వివిధ అంశాల్లో వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్వయంగా సీఎంను మెచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్‌ను మెచ్చుకోవడానికి కారణం అంబులెన్స్‌లు. రెండురోజుల క్రితం వెయ్యికి పైగా 104, 108 అంబులెన్స్ వాహనాలను జగన్ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సేవలు అందించే అంబులెన్స్‌లు జగన్ ప్రారంభించడం అభినందనీయమని ట్వీట్ చేశారు.
పవన్ ట్వీట్ పైన నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇదే స్థానంలో జగన్ ఉంటే కచ్చితంగా మెచ్చుకోకపోయేవారని ఒకరు అంటే, కొత్త అంబులెన్స్‌లు కాదని, పాత వాటిని రిపెయిర్ చేసి, కొత్తగా చేసి తీసుకు వచ్చారని మరో నెటిజన్ పేర్కొన్నారు. మంచి పని చేస్తే పవన్ కళ్యాణ్ ఎవరినైనా మెచ్చుకుంటారని మరో నెటిజన్ పేర్కొన్నారు.
బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా సీఎం జగన్ అంబులెన్స్‌లను ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 1068 అంబులెన్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. బెంజ్ సర్కిల్ వద్ద సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా ఈ వాహనాలు బారులు తీరాయి. అనంతరం జగన్ ప్రారంభించిన అనంతరం ఆ వాహనాలు జిల్లాలకు వెళ్లాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates