గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఏమో కానీ.. ఏపీ అధికార పార్టీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి చేదు అనుభవం ఒకటి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఎదురైంది. రాయచోటిలో తాజాగా ఆయన నిర్వహించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఒక వ్యక్తి నవ్వుతూ ఎదురురావటం.. దీంతో అతనికి సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డికి.. అనూహ్యమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను ఏదో అనుకుంటే మరేదో అయిన విషయాన్ని గుర్తించిన శ్రీకాంత్ రెడ్డి అతని నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ ఆ వ్యక్తి వెనక్కి తగ్గకుండా.. సంక్షేమ పథకాలు రావాలంటే సొంతంగా ఏమీ ఉండొద్దా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు తమకు ఏమీ రావట్లేదన్న ఆయన.. సొంతంగా ఏమీ ఉండొద్దన్న మాటను ఎన్నికల వేళ ఓట్లు అడిగిన సమయంలో చెప్పలేదెందుకు? అని ప్రశ్నించారు. తాను అతి చేయట్లేదన్న అతగాడి ప్రశ్నలు వైసీపీ వర్గాలకు ఇబ్బందికరంగా మారాయి.
‘సార్.. రెండు మాటలు అడుగుతా.. నాకు అవకాశం ఇవ్వండి’ అంటూ గడికోట శ్రీకాంత్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న ముస్లిం మైనార్టీ వ్యక్తి మాటలకు.. సరే.. అడుగమన్నారు. దీనికి స్పందించిన సదరు వ్యక్తి.. మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రావాలంటే సొంతంగా ఏమీ ఉండకూడదా? అంటూ ప్రశ్నిస్తూ.. ‘సొంత ఇల్లు.. బండి, కారు చివరకు సొంత పెళ్ళాం కూడా ఉండకూడదా సార్?’ అని ప్రశ్నించారు.
దీంతో.. అతని మాటలకు సమాధానం చెప్పని శ్రీకాంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే.. ఆయన్ను ముందుకు కదలకుండా అడ్డుపడిన ఆ వ్యక్తి.. సొంతంగా ఏమీ ఉండకూడదన్న మాటను ఎన్నికల మేనిఫేస్టోలో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. ఈసారి.. నీ కోసం పెట్టిస్తాలే.. అంటూ కాసింత చిరాకుతో శ్రీకాంత్ రెడ్డి ముందుకు వెళ్లగా.. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటే.. ఓట్లు వేసి గెలిపించామని.. మిమ్మల్ని అడిగే హక్కు తమకు ఎందుకు ఉండకూడదంటూ చేసిన అతడి వ్యాఖ్యలు శ్రీకాంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates