టీడీపీ.. వైసీపీ సాధించింది ఏంటంటే..!

ఔను.. అప్ప‌ట్లో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.. రెండు పార్టీలు కూడా.. ఇబ్బందులు ప‌డుతున్నాయి. ప్ర‌త్య‌ర్థి ప‌క్షాల‌ను రాజ‌కీయంగా అంతం చేయాల‌నే ల‌క్ష్యం కావొచ్చు.. త‌మ‌కు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఎవ‌రికీ జై కొట్ట‌రు.. అనే దూకుడు కావొచ్చు. ఎలా చూసుకున్నా.. ఈ రెండు పార్టీలు కూడా.. అధికారంలో ఉండ‌గా.. ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను చేర్చుకునేందుకు చాలానే ఉత్సాహం చూపించారు. అయితే.. దీనివ‌ల్ల సాధించింది ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు వ‌ల విసిరింది. అంతేకాదు.. చేర్చుకుని.. మంత్రి ప‌ద‌వులు ఇచ్చింది. అయితే.. వీరిలో ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. ఇత‌ర నాయ‌కులు ఎవ‌రూ కూడా పార్టీకి అండ‌గా నిలిచింది లేదు. పైగా వీరి రాక‌తో.. లేనిపోని ఇబ్బందులు వ‌చ్చాయి. సొంత పార్టీ నాయ‌కులను ప‌క్క‌న పెట్టి.. వీరికి టికెట్లు ఇవ్వ‌డం వ‌ల్ల‌.. స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. పోనీ.. త‌ర్వాత‌.. పార్టీ అధికారంలో లేన‌ప్పుడు.. వీరు పార్టీకి ఏమైనా చేస్తున్నారా? అంటే.. అది కూడా లేదు.

దీంతో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చుట్టూ.. తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. టీడీపీ నుంచి తీసుకున్న న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఎలాంటి ప్రాధాన్యం లేదు. వారికి అస‌లు గుర్తింపే లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది. క‌నీసం.. గ‌తంలో అయినా.. మంత్రి ప‌ద‌వుల‌తో.. ఆర్థికంగా డ‌బ్బులో ఇచ్చి.. ఆదుకున్న ప‌రిస్థితి జంపింగుల‌కు క‌లిసి వ‌చ్చింది. కానీ.. ఇప్పుడు వారికి ఏమీ క‌నిపించ‌డం లేదు.

పైగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య‌తీవ్ర వివాదాలు.. వ్య‌తిరేక‌త‌.. టికెట్‌ల ర‌గ‌డ‌లు పెరిగిపోయాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జంపింగుల‌తో పార్టీల‌కు ఒరిగింది కానీ.. పోయింది కానీ.. ఏమీ లేదు. నిజానికి అప్ప‌ట్టో వైసీపీని ఏదో చేయాల‌ని అనుకున్న టీడీపీ సాధించింది ఏమీ లేదు. ఇక‌, ఇప్పుడు టీడీపీని లేకుండా చేయాల‌ని అనుకున్న వైసీపీ సాధించింది కూడా ఏమీ క‌నిపించ‌డం లేదు. కానీ.. ఇలా జంపింగుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా.. ఆయా పార్టీలే చుల‌క‌న అవుతున్నాయి.. అంత‌ర్గ‌త వివాదాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.