పెద్దలసభలో ఇంతమంది నేరచరితులా?

రాజకీయాల్లో నేరచరితులు ఉండకూడదని ఒకవైపు జనాలు నానా గోలచేస్తుంటే మరోవైపు రాజకీయపార్టీలు ఎక్కువగా నేరచరితులకు ప్రాధాన్యతిస్తున్నాయి. దేశంలోని అన్నీపార్టీలు దాదాపు ఇదే పద్దతిలో ముందుకు వెళుతున్నాయి. బహిరంగసభల్లో పార్టీలు చెప్పేదొకటి, అవసరానికి చేస్తున్నదొకటిగా ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అసోసియేష్ ఫర్ డమొక్రటికి రిఫార్స్మ్ (ఏడీఆర్) అనే సంస్ధ మన రాజకీయాల్లోని నేరచరితుల చిట్టాను ఎప్పటికప్పుడు బయటపెడుతునే ఉంది.

ఇపుడిదంతా ఎందుకంటే ఏపీలోని పెద్దలసభగా చెప్పుకునే శాసనమండలిలోని నేరచరితుల బండారం బయటపెట్టింది. ఏడీఆర్ బయటపెట్టిన జాబితా ప్రకారం మొత్తం 58 మంది సభ్యుల్లో 20 మందిపైన క్రిమినల్ కేసులున్నాయట. అంటే దాదాపు 40 మంది సభ్యులపై క్రిమినల్ కేసులున్నట్లే లెక్క. ఇంతమంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న సభ్యులున్న సభ పెద్దలసభ ఎలాగ అవుతుందన్నదే జనాలను పట్టిపీడిస్తున్న ప్రశ్న.

క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 20 మంది సభ్యుల్లో 13 మంది అధికార వైసీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు ఆరుమందుంటే ఒక సభ్యుడు పీడీఎఫ్ సభ్యుడు కావటం గమనార్హం. అంటే వైసీపీ, టీడీపీలను గమనిస్తే రెండుపార్టీలు కూడా నేరచరితులను యధేచ్చగా ప్రోత్సహిస్తున్నట్లు అర్ధమవుతోంది. 58 మందిలో టీడీపీకి చెందిన ఇద్దరు ఎంఎల్సీలు అంగర రామ్మోహన్, బచ్చుల అర్జునుడు అఫిడవిట్లు అందుబాటులో లేవు. అలాగే మరో ఎనిమిదిమంది నామినేటెడ్ ఎంఎల్సీలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవటంతో వాళ్ళ చరిత్ర అందుబాటులో లేదని ఏడీఆర్ ప్రకటించింది.

అంటే ఈ పదిమంది ఎంఎల్సీలను పక్కనపెడితే అందుబాటులో ఉన్న 48 మంది ఎంఎల్సీల అఫిడవిట్ల ప్రకారం చూస్తే 20 మందిపై క్రిమినల్ రికార్డులుండటం ఆశ్చర్యంగా ఉంది. నేరచరిత్రున్న ఈ 20 మందిలో కూడా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురూ వైసీపీ నేతలే కావటం గమనార్హం. దువ్వాడ శ్రీనివాస్, గంగుల ప్రభాకరరెడ్డి, అనంతసత్య ఉదయభాస్కర్ పై హత్యాయత్నం, దోపిడి, చోరీ, మారణాయుధాల వినియోగం, అల్లర్లు, దాడుల కేసులు, వివిధ వర్గాల మధ్య విధ్వేషాన్ని రెచ్చగొట్టిన కేసులున్నాయి. రాజకీయాల్లో నేరచరితులుండకూడదనే నినాదం నేతిబీరకాయ చందంగానే తయారైంది.