మరో పాదయాత్రకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్న డిమాండ్ తో కొంతకాలం క్రితం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ తిరుపతి అలిపిరి వరకు పాదయాత్ర చేయటం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు అంటూ మరో మహా పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 12 నుంచి తాజా పాదయాత్ర షురూ కానుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఆందోళన మొదలు పెట్టి సెప్టెంబరు 12 నాటికి వెయ్యి రోజులు పూర్తి కానున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి పాదయాత్ర చేపట్టడం ద్వారా తమ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలన్న డిమాండ్ తో 44 రోజుల పాటు తొలి మహాపాదయాత్రను నిర్వహించి.. తిరుపతిలోని అలిపిరి వద్ద పాదయాత్రను ముగించి.. బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు నిర్వహించిన మొదటి పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనటం.. ఆ సందర్భంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.

నిత్య నరకాన్ని భరిస్తూ.. తమ డిమాండ్ల విషయంలో జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ వారు పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి పాదాల చెంత ముగిసిన పాదయాత్ర తాజాగా ఏపీ అసెంబ్లీ నుంచి షురూ కానుంది. ఈ దఫా కూడా పాదయాత్రలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లోని మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా అమరావతి నుంచి పాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయించిన విశాఖ మీదుగా అరసవెల్లికి వెళ్లనుంది.

అమరావతి రైతులు ప్రకటించిన ఈ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 30 వేల ఎకరాలకు పైగా భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేయటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానితోనే.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒకే రాజధానిని ఏర్పాటు చేయాలన్న నినాదంతో మహా పాదయాత్రను నిర్వహిస్తున్నారు. తాజా పాదయాత్రతో మరోసారి రచ్చ తప్పదన్న మాట వినిపిస్తోంది.