కేసీయార్ నిర్ణయం.. షాక్ ఇస్తున్న నేతలు

పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించటం ద్వారా మునుగోడు నేతలు ఏకంగా కేసీయార్ కే షాకిచ్చారు. మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఉపఎన్నికలో పోటీచేయించాలని కేసీయార్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చెప్పి నేతలందరినీ ఒప్పించమని బాధ్యత అప్పగించారు. అయితే నేతలంతా కలిసి మంత్రితో పాటు కేసీయార్ కు కూడా పెద్ద షాకిచ్చారు.

కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మంత్రితో తెగేసి చెప్పారు. ఇదే విషయాన్ని తాము ఇంతకుముందు కేసీయార్ కు నేరుగా లేఖ రాసినట్లు నేతలు చెబుతున్నారు. బుధవారం ఉదయం నుంచి నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటి ఛైర్మన్లు సుమారు 30 మందితో మంత్రి భేటీలు జరిపారు. మంత్రి ఎంత చెప్పినా నేతలు అంగీకరించలేదు. దాంతో విషయాన్ని మంత్రి కేసీయార్ దృష్టికే తీసుకెళ్ళారు.

నేతలు ఇంతగా వ్యతిరేకిస్తున్న కూసుకుంట్లకే టికెట్ ఇవ్వాలని కేసీయార్+మంత్రి ఎందుకు పట్టుబడుతున్నారో అర్ధం కావటం లేదు. ఇంతమంది నేతలు వ్యతిరేకిస్తున్న వ్యక్తిని కేసీయార్ అభ్యర్ధిగా వద్దని అంటున్నారు. వ్యవహారం చూస్తుంటే కేసీయార్ చెప్పినా పై 30 మంది నేతలు అంగీకరించేట్లు లేరు. ఒకవేళ కేసీయార్ తో ముఖాముఖి సమావేశంలో ఏమీ చెప్పలేకపోయినా మనస్పూర్తిగా గెలుపుకు పనిచేస్తారని గ్యారెంటీ అయితే లేదు. ఈ విషయాలు కేసీయార్ కు తెలిసినా పదే పదే కూసుకుంట్ల విషయంలో పట్టుబడుతున్నారు.

ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని కాబట్టి అందరు కేసీయార్ ఎంపిక చేసిన అభ్యర్ధి కోసం కష్టపడాలని మంత్రి పదేపదే నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ ఎవరికివ్వాలనేది కేసీయార్ ఇష్టమని ఉపఎన్నికలో గెలుపు తర్వాత కష్టపడిన నేతలందరికీ మంచి గుర్తింపు ఉంటుందని బిస్కెట్ వేస్తున్నా నేతలెవరూ ఒప్పుకోవటం లేదు. అభ్యర్ధి విషయంలో నియోజకవర్గంలోని 30 మంది నేతలు తనకు ఎదురు తిరుగుతారని కేసీయార్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో ఇపుడేంచేయాలో సీఎంకు అర్ధం కావటం లేదు.