హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో వెలుగుచూసిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. నాలుగురోజుల క్రితం మాధవ్ ఎవరో మహిళలో న్యూడ్ గా మాట్లాడుతున్న వీడియో వెలుగుచూసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియోపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వీడియో వెలుగుచూడగానే మాధవ్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో సదరు వీడియో మార్ఫింగ్ చేసిందని ఎంపీ ఆరోపించారు.
ఆరోపణలు చేసిన మాధవ్ అంతటి ఆగకుండా మీడియా యాజమాన్యాలను లక్ష్యంగా చేసుకుని బూతులుతిట్టారు. తాను కురుబ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి కమ్మ సామాజికవర్గంలోని కొందరు కావాలనే తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. అంతేకాకుండా వీడియో వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే వివాదాస్పద వీడియోపై పోలీసుల విచారణ జరుగుతోంది. కానీ అది మార్ఫింగా కాదా అనే విషయం ఇప్పుడప్పుడే బయటకు రాదు, రానివ్వరు. అలా విచారణ కొనసాగుతుంటుంది అంతే.
మరో వైపు మీడియా వీడియోపై పదే పదే వార్తలు, కథనాలు అందిస్తోంది. దాంతో అసలు విషయం మరుగునపడిపోయి కొసరు విషయం పెద్దదైపోయింది. ఇక్కడ కొసరు విషయం ఏమిటంటే సామాజికవర్గాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఎంపీ వైఖరికి వ్యతిరేకంగా కమ్మ సామాజికవర్గంలోని సంఘాలు పెద్దఎత్తున కదిరి, అనంతపురంలో ర్యాలీలు నిర్వహించాయి. ఇదే సమయంలో కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా కురబకుల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో పోటీ ర్యాలీలు జరిగాయి. రెండువైపుల ర్యాలీల్లోను ఉద్రిక్తతలు పెరిగిపోవటంతో పోలీసులు ఎంటరవ్వక తప్పలేదు.
కమ్మసంఘం ఆధ్వర్యంలో ఇదే విధమైన ర్యాలీ హైదరాబాద్ లో కూడా జరిగింది. దాంతో కురబకులం ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్ లో ర్యాలీకు సన్నాహకాలు మొదలయ్యాయి. మొత్తానికి ఎంపీ వ్యక్తిగత విషయం కాస్త రెండు సామాజికవర్గాల మధ్య గొడవలుగా మారిపోతున్నాయి. సామాజికవర్గాల మధ్య గొడవలు పెరిగిపోతే అసలు విషయమైన వివాదాస్పద వీడియో వ్యవహారం మూలనపడిపోయే అవకాశముంది. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates