గత కొద్దికాలంగా ఏపీలో అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన దూకుడు నిర్ణయాలతో వైసీపీ అధిష్టానానికి చుక్కలు చూపిస్తుండగా మరోవైపు వైసీపీ ముఖ్యనేత, పార్టీలో నంబర్2 అనే పేరున్న ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ రథసారథి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు మారిపోయాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇలాంటి తరుణంలో వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. అది
విజయసాయిరెడ్డికి తీపికబురు కావడం గమనార్హం.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కీలక పత్రికా ప్రకటన వెలువడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకొని జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారని పేర్కొంది.
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఇంచార్జీగా ఉంటారని పేర్కొంది. వైవీ సుబ్బారెడ్డి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలను, సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని ప్రకటన పేర్కొంది.
కాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డికి మధ్య పొసగడం లేదనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలోపలు సంఘటనలు తెరమీదకు వచ్చాయి. కాగా, ఈ ప్రచారానికి చెక్ పెట్టేలా పార్టీకి కీలకమైన ఉత్తరాంధ్ర, అందులోనూ ప్రతిపాదిత పరిపాలన రాజధాని కొలువుదీరిన విశాఖపట్నం జిల్లాల బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించడం సీఎం జగన్ వద్ద ఆయనకు ఉన్న పట్టును స్పష్టం చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. పైగా విజయసాయిరెడ్డి పుట్టిన రోజే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం బర్త్‌డే గిఫ్ట్ అని పేర్కొంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates