మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. ప్రజాస్వామ్య భారతంలో ఏమైనా జరిగే వీలుంది. అది ఈ దేశానికి మాత్రమే సాధ్యమన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. అందుకు నిబంధనలు.. విధానాలు సాయం చేస్తుంటాయి. తాజాగా ఏపీ అధికార పక్షం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఆయన ఈ రోజు రాజ్యసభ సభాపతి స్థానంలో కూర్చొని.. పెద్దల సభను నిర్వహించే వీలు లభించింది.
ఈ పరిణామాన్ని కొందరు హర్షించొచ్చు. మరికొందరు జీర్ణించుకోకపోవచ్చు. కానీ.. విధానాల పరంగా ఈ దేశంలో ఏమైనా సాధ్యమనే విషయానికి ఈ ఉదంతం ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. నిబంధనల ప్రకారం రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ లో విజయసాయి రెడ్డికి ఇటీవల అవకాశం లభించింది. రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో గురువారం తొలిసారి ఆయన రాజ్యసభను నడించారు.
అదెలా సాధ్యమైందంటే.. రాజ్యసభ ఛైర్మన్.. డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు.. వైస్ ఛైర్మన్లుగా ఎంపికైన వారిలో ఎవరో ఒకరు సభను నిర్వహించే వీలు ఉంటుంది. గత నెలలో రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్ ను ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రీషఫిల్ చేశారు. అందులో విజయసాయికి చోటు లభించింది. విజయసాయి విషయానికి వస్తే ఆడిటర్ గా సుప్రసిద్ధుడు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. ఆయన మీద ఉన్న కేసుల్లో జగన్ తో పాటు సహ నిందితుడిగా పలు కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అవి కోర్టు విచారణలో ఉన్నాయి. ఇలాంటివేళలో.. దేశంలోనే అత్యుత్తమమైన పార్లమెంటు లోని పెద్దల సభను నిర్వహించే వీలు చిక్కటం చూస్తే.. మన దేశంలోని నిబంధనలు.. విధానాలు ఆసక్తికరంగా ఉంటాయని చెప్పక తప్పదు. ఈ దేశంలో ఏమైనా జరగొచ్చన్న దానికి నిలువెత్త నిదర్శనంగా తాజా పరిణామాన్ని చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates