ఎన్టీఆర్ కుమార్తె మ‌ర‌ణంపై సాయిరెడ్డి ట్వీట్‌

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ వి. విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. ఆయ‌న మార లేదు.. అని వ్యాఖ్య‌లు కుమ్మ‌రిస్తున్నారు. అంతేకాదు.. కొంద‌రు అయితే.. మ‌రి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. తాజాగా అన్న‌గారు ఎన్టీఆర్ కుటుంబం లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప్ర‌జ‌లు సానుభూతి వ్య‌క్తం చేశారు.

అన్న‌గారి చిన్న కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి.. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ విషాదం నుంచి అన్న‌గారి కుటుంబం స‌హా.. అభిమానులు.. టీడీపీ నాయ‌కులు కూడా ఇంకా తేరుకోలేదు. అయితే.. ఇంత విషాదాన్ని కూడా త‌మ రాజ‌కీయాల‌కు వినియోగించుకునేలా.. వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వైసీపీ డిజిట‌ల్ విభాగం.. చైర్మ‌న్‌గా ఉన్న గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి `హూ కిల్డ్ పిన్ని` హ్యాష్‌ట్యాగ్‌తో రెండు రోజులుగా నానా ర‌చ్చ చేస్తున్నాడు.

దీనిపై టీడీపీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఈ వివాదంలోకి సాయిరెడ్డి కూడా దూరిపోయి.. నానా మాట‌లు అనేశారు. “ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయి. మా చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. CBI దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా.“ అని ట్వీట్ చేశారు.

దీనిపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. అన్న‌గారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపో యి ఉన్న స‌మ‌యంలో ఇలాంటి దౌర్భాగ్య వ్యాఖ్య‌లు ఎలా చేస్తారంటూ.. ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు.. అయితే.. ముందు సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హ‌త్య సంగ‌తి తేల్చండంటూ.. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఇంకొంద‌రు.. మ‌రో అడుగు ముందుకు వేసి.. విజ‌య‌సాయిని తీవ్ర‌స్థాయిలో దూషించారు. మొత్తంగా చూస్తే.. సాయిరెడ్డి స్థాయికి ఇది త‌గ‌ద‌నే సంకేతాలు రావ‌డం గ‌మ‌నార్హం.